కలం డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం (Telangana Cabinet) ఈ నెల 22న సమావేశం కానున్నది. గత నెల 25న సమావేశం తర్వాత మళ్ళీ జరగబోతున్న భేటీ ఇదే. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) రెండు రోజుల పాటు నిర్వహించి రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ (MoU)లు కుదుర్చుకోవడంపై ముఖ్యమంత్రిని సహచర మంత్రులు అభినందించే అవకాశమున్నది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కూడా ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం. జెడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC) ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నందున వీలైనంత తొందరగా ఆ ప్రక్రియను కూడా పూర్తి చేయాలనే చర్చ కాంగ్రెస్ నేతల్లో జరుగుతున్నా తొందరేమీ లేదని ప్రభుత్వం భావిస్తున్నది. దీనిపై మంత్రుల అభిప్రాయాలను సీఎం తీసుకునే అవకాశమున్నది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతికి అదే రోజున ప్రభుత్వం వీడ్కోలు పలకనున్నది.
అసెంబ్లీ సెషన్ నిర్వహణపై చర్చ :
ఈ నెల చివర్లో అసెంబ్లీ సెషన్ (Assembly Session) నిర్వహించడంపై మంత్రివర్గంలో చర్చ జరగనున్నది. గత సెషన్ సెప్టెంబర్ 1న ముగిసిన తర్వాత ప్రభుత్వం ఏడు ఆర్డినెన్సులను (Ordinances) తీసుకొచ్చింది. అందులో జీహెచ్ఎంసీ (GHMC), వివిధ మున్సిపాలిటీలకు (Municipal Bodies) సంబంధించినవి కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన బిల్లులను రూపొందించి అసెంబ్లీ సెషన్‌లో చర్చకు పెట్టి ఆమోదం పొందే అవకాశాలున్నాయి.
ఎప్పటి నుంచి సెషన్ పెట్టొచ్చు, ఎన్ని రోజులు నడపాలి తదితరాలపై క్యాబినెట్ (Telangana Cabinet) భేటీలో చర్చించిన తర్వాత స్పష్టత రానున్నది. దీనికి తోడు బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్రం సమర్పించనున్నందున ఏయే మంత్రిత్వశాఖ నుంచి రాష్ట్రానికి ఏ మేరకు నిధులు కావాలో, ఎలాంటి అవసరాలు ఉన్నాయో రాష్ట్రం తరఫున వివరించడానికి ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాల్సిందిగా మంత్రులకు సీఎం స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.
Read Also: నేను కాంగ్రెస్ లో చేరలేదు.. కడియం శ్రీహరి వివరణ
Follow Us On: Pinterest


