Mobile Popup Ad
Mobile Popup Ad

ఆడబిడ్డలతో పెట్టుకుంటే అధికారమే పోతుంది: రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: ఆడబిడ్డలతో పెట్టుకుంటే అధికారమే పోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆడబిడ్డలకు గత ముఖ్యమంత్రి న్యాయం చేయలేదని.. అందుకే ఆయన ఫామ్‌హౌస్‌లో పడుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి‌సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ మహిళలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. అధికారంలో ఉన్న మొదటి ఐదేండ్లు మహిళలకు క్యాబినెట్‌లో అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు న్యాయం చేశామని చెప్పుకొచ్చారు. మహిళందరికీ ఆర్టీసీ‌బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డలు తల్లిగారింటికి పోయినా.. అమ్మవారి దర్శనానికి పోయినా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంతో పాఠశాలల్లో డ్రాపౌట్స్ కూడా తగ్గిపోయాయని పేర్కొన్నారు.

ఫ్రీ బస్ స్కీమ్‌పై కుట్రలు

ఫ్రీ‌బస్ స్కీమ్‌పై బీఆర్ఎస్ కుట్రలు చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఈ పథకాన్ని ఆపే కుట్ర చేశారని ఫైర్ అయ్యారు. ఆడబిడ్డలు చదువుకునేందుకు అన్నివిధాలా ఈ ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. మహిళా సంఘాలను పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఆడబిడ్డలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.

కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు ఓటు హక్కు

కాంగ్రెస్ పాలనలోనే మహిళలకు పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా వ్యవహరించారని పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌ను విడదీశారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ పాలనలో మహిళా సంఘాల రుణ పరిమితిని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచానని గుర్తు చేశారు. తెలంగాణ ఆడబిడ్డలను చూస్తే తన మనసు నిండిపోతున్నదని పేర్కొన్నారు.

పంట మార్పిడి అవసరం

తెలంగాణ రాష్ట్రంలో పంట మార్పిడి అవసరమని పేర్కొన్నారు. కేవలం వడ్లు, మొక్కజొన్న మాత్రమే సాగు చేయొద్దన్నారు. కూరగాయల సాగు, పండ్ల తోటల సాగు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా సంఘాలు ఇటీవల కొనుగోలు కేంద్రాలను సమర్థంగా నిర్వహించారని.. ఇక నుంచి వారంతా గ్రామాల్లోకి వెళ్లి పంట మార్పిడి విషయంలోనే రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు

ఇక నుంచి రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని పేర్కొన్నారు. ఆడబిడ్డల పేరు మీదే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు. ఆస్తి బిడ్డల పేరు మీద ఉంటేనే న్యాయం జరుగుతుందన్నారు. మగవాళ్ల పేరు మీద ఆస్తి ఉంటే బెల్ట్ షాపులకే ధారాదత్తం చేస్తారని పేర్కొన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోయే సంక్షేమ పథకాల్లో ఆడబిడ్డలకు న్యాయం చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వ సంకల్పానికి వరుణదేవుడు కూడా సహకారం అందిస్తున్నాడని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>