కలం, వెబ్ డెస్క్: నీట్ (NEET) పరీక్ష లీకేజీతో వస్తున్న తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ నెల 21న నిర్వహించే రీ–ఎగ్జామ్‌ను కేంద్ర ప్రభుత్వం సవాల్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రధాని మోదీ ఆదేశాలతో నేరుగా పీఎంవో పర్యవేక్షణ చేస్తోంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్టీఏ కార్యాలయాన్ని సందర్శించి పరీక్ష పేపర్ల భద్రత, రవాణా అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నో సవాళ్లు ఉండేవి, ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నట్లుగా వివరించారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ సచివాలయం, హోం మంత్రిత్వ శాఖ వంటి కీలక వ్యవస్థలు భాగమైనట్లు తెలిపారు. తాను ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి చర్చించినట్లు వివరించారు. మరికాసేపట్లో కేంద్ర వైద్యారోగ్య మంత్రిని కూడా కలుస్తానని స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సంస్థలు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయని, అత్యున్నత నేతలు పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రాల నుంచి కూడా ఇదే తరహా సహకారం ఆశిస్తున్నామని, ముఖ్యమంత్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు.
ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లో పేపర్ల తరలింపు..
సుమారు 22 లక్షల మంది హాజరు కాబోతున్న నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాల తరలింపునకు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు వాడబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికను కూడా రూపొందించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్ష కంప్యూటర్ విధానంలోనే జరగబోతుంది.

