కలం, వెబ్ డెస్క్ : భద్రాచలం శ్రీరామ చంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth) సమీక్ష నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో, పూజారులు, అధికారులు పాల్గొన్నారు.
గోదావరి పుష్కరాలలోపు చేయగలిగిన పనులతో తొలిదశ అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth) ఆదేశించారు. ఆలయ అభివృద్ధిని మూడు దశల్లో పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఇప్పటి దాకా సేకరించిన భూములకు అనుగుణంగా ఆలయ అభివృద్ధిపై డిజైన్లను సీఎం రేవంత్ పరిశీలించారు. ఆలయ సహజత్వానికి ఎలాంటి భంగం కలగకుండా.. ఆగమశాస్త్రానుసారం ప్రకారమే పూర్తి అభివృద్ధి పనులు చేయాలని సీఎం రేవంత్ వెల్లడించారు.
2027 మార్చి 31 నాటికి తొలిదశ పనులను కంప్లీట్ చేయాలని, పనులు జరిగినన్ని రోజులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం రేవంత్ చెప్పారు. గోదావరి పుష్కరాల కోసం ఘాట్స్ నిర్మాణంతో పాటు ఇతర పనులను పూర్తి చేయాలన్నారు. పుష్కరాలు ముగిసిన తర్వాత మిగతా పనులను కంప్లీట్ చేయాలని.. అందుకు తగ్గ ప్రణాళికలు, అంచనాలు ఇప్పుడు రెడీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

