కలం, వెబ్ డెస్క్: హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై ఇరాన్ (Iran) దళాలు జరుపుతున్న దాడులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సహా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ లాంటి 26 దేశాలు తీవ్రంగా ఖండించాయి. నౌకలపై దాడులు చేయడం, జలసంధిని మూసివేయడం వంటి చర్యలు అంతర్జాతీయ శాంతికి భంగం కలిగిస్తున్నాయని ఈ దేశాలు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. తక్షణమే డ్రోన్, క్షిపణి దాడులను నిలిపివేసి, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానానికి కట్టుబడి ఉండాలని ఇరాన్‌ను డిమాండ్ చేశాయి.
ప్రపంచ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం
ఇరాన్ (Iran) చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉందని ఈ దేశాల ప్రతినిధులు హెచ్చరించారు. ముఖ్యంగా నిరుపేద దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం సముద్రయాన స్వేచ్ఛ అనేది ప్రాథమిక సూత్రమని, వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకం కలిగించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో చమురు ధరలు పెరగకుండా ఇంధన మార్కెట్‌ను స్థిరీకరించేందుకు పెట్రోలియం నిల్వలను విడుదల చేయాలని కోరింది.
సురక్షిత ప్రయాణానికి సమిష్టి కార్యాచరణ
జలసంధి గుండా వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భాగస్వామ్య దేశాలు ప్రకటించాయి. ఉత్పత్తిని పెంచడానికి చమురు ఉత్పత్తి చేసే దేశాలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశాయి. అలాగే ఈ సంక్షోభం వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశాలకు ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల (IFIs) ద్వారా మద్దతు అందిస్తామని భరోసా ఇచ్చాయి. ప్రపంచ సుస్థిరత, ఆర్థిక వృద్ధికి సముద్ర భద్రత అత్యంత కీలకమని విజ్ఞప్తి చేశాయి.

