కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వరి ధాన్యం కొనుగోలులో తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే తీవ్ర పరిణామాలు తప్పవని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) హెచ్చరించారు. సోమవారం నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితులను పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్లు, చందుబట్ల మండలంలోని శ్రీ వెంకటేశ్వర అగ్రో ఇండస్ట్రీస్‌లో మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. రైస్ మిల్లుల్లో ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియపై మంత్రి రైతులను అడిగి తెలుసుకున్నారు.
రోజుల తరబడి ధాన్యం అన్‌లోడ్ చేయకుండా లారీలను నిలిపివేయడంపై మిల్లు యాజమాన్యాలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దని హెచ్చరించారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు ఏ మాత్రం ఉపేక్షించవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోజుల తరబడి లారీల్లోనే ధాన్యం ఉండటం, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే మిల్లు యజమానుల తీరు కొనసాగితే బాగుండదని హెచ్చరించారు. రైతులకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైస్ మిల్లులు, గోదాముల వద్ద ప్రతి లారీ అన్‌లోడ్ అయ్యేలా పర్యవేక్షించాలని ఎస్పీకి మంత్రి అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు. మిల్లులు, గోదాముల వద్ద పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలని , కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరగకుండా, వెంటనే మిల్లులకు తరలించి అన్‌లోడ్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
Read Also: రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు
Read Also: సర్కారు ఆసుపత్రులు అస్తవ్యస్తం

