కలం, వెబ్‌డెస్క్: క్యారెట్ (Carrot ) ఏ సీజన్‌లో అయినా దొరికే ఒక వెజిటబుల్. ఇది కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని మీకు తెలుసా? అవును క్యారెట్ చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని సూచిస్తున్నారు నిపుణులు. క్యారెట్‌తో వృద్ధాప్యాన్ని నివారించే, చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిపించే రకరకాల ఫేస్ ప్యాక్స్ (Carrot Face Pack) , మాస్క్ కూడా తయారు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అవేమిటో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
లాంగ్ లాస్టింగ్ మేకప్ కోసం
మనం వేసుకునే మేకప్ ఎక్కువ సమయం నిలిచి ఉండాలంటే చర్మంలో తేమ శాతం బాగుండాలి. అందుకే మేకప్ వేసుకోవడానికి ముందు అరటేబుల్ స్పూన్ క్యారట్ జ్యూస్‌కు, అరటేబుల్ స్పూన్ కమలారసం బాగా కలపాలట. ఈ మిశ్రమంతో ముఖానికి 10 నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసి తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మేకప్ వేసుకుంటే ఆ ప్రభావం ఎక్కువసేపు కనిపిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
పిగ్మెంటేషన్ సమస్యకు చెక్
పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించేందుకు క్యారెట్ బాగా ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు నిపుణులు. దీనికోసం క్యారెట్‌తో ఈ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
ముందుగా క్యారట్‌ను తరిగి గ్రైండ్ చేసి 2 టేబుల్ స్పూన్స్ జ్యూస్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్ కి 1 టేబుల్ స్పూన్స్ ఓట్స్ పౌడర్ ని జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం మెత్తని పేస్ట్ అయ్యాక దానికి కాస్త పసుపు, 1 టేబుల్ స్పూన్ పంచదార జత చేయండి. బాగా మిక్స్ చేశాక ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని మృదువుగా మర్దన చేయాలి. 20 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పసుపు మేని ఛాయని మెరుగుపరిస్తే, క్యారట్ జ్యూస్ చర్మం కాంతులీనడానికి సహాయపడుతుంది. పంచదార, ఓట్స్ పౌడర్ స్క్రబ్ల పనిచేస్తాయి అంటున్నారు నిపుణులు.
అయితే ఈ చిట్కాలు సహజసిద్ధమైనవే అయినప్పటికీ.. చర్మతత్వానికి సరిపడతాయో లేదో తెలుసుకోవడానికి ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

