కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పరిధిలోని 8 గురుకుల పాఠశాలలు/కళాశాలలు, ఒక గురుకుల డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ఆర్ట్ & క్రాఫ్ట్, మ్యూజిక్, హెల్త్ సూపర్‌వైజర్ పోస్టులను పార్ట్ టైమ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు కేవలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ధృవపత్రాల నకళ్లతో కలిపి ఈ నెల 7వ తేదీ సాయంత్రం 3 గంటల లోపు పాల్వంచలోని “జిల్లా సమన్వయ అధికారి కార్యాలయం, గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGSWREIS), బాలుర జూనియర్ కళాశాల” చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారికి మరుసటి రోజు, అనగా 08-07-2026 ఉదయం 10 గంటల నుండి అదే వేదికపై ఎంపిక కమిటీ సమక్షంలో టీచింగ్ డెమోలు నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ బోధనా నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయబడతారని, డెమోలకు హాజరయ్యే వారు ఒరిజినల్ సర్టిఫికేట్లు, గుర్తింపు కార్డుతో రావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

