Mobile Popup Ad
Mobile Popup Ad

అడ్లూరి vs కొప్పుల.. ధర్మపురిలో వేడెక్కిన రాజకీయం!

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ రాజకీయాలు (Dharmapuri Politics) ఒక్కసారిగా రసవత్తరంగా మారాయి. ప్రస్తుత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్య నడుస్తున్న ‘డైలాగ్ వార్’ డైనమైట్లను తలపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ ప్రత్యర్థులైన వీరిద్దరి మధ్య మాటల యుద్ధం శృతిమించి వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లడంతో స్థానిక పాలిటిక్స్ తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు సీనియర్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.

టెండర్ల రచ్చ.. అవినీతి ఆరోపణలు

ఇటీవల కాలంలో సంక్షేమ శాఖలో జరిగిన టెండర్ల వ్యవహారం ఈ ఇద్దరు నేతల మధ్య తీవ్ర దుమారానికి దారితీసింది. గతంలో ఈ శాఖను నిర్వహించిన కొప్పుల ఈశ్వర్ ప్రస్తుత మంత్రి అడ్లూరిపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. సంక్షేమ శాఖ టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కొప్పుల స్పష్టం చేశారు. వీటితో పాటు ధర్మపురి నియోజకవర్గంలో ఇసుక దందా, ధాన్యం కొనుగోళ్లలోనూ పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందని ఆరోపించారు.

‘ఉప్పులు..పప్పులు’ అమ్మిన చరిత్ర మీది: మంత్రి కౌంటర్

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపణలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) అంతే ఘాటుగా స్పందించారు. గత బీఆర్ఎస్ హయాంలోనే విచ్చలవిడిగా అవినీతి జరిగిందని, గతంలో ‘ఉప్పులు, పప్పులు’ అమ్ముకున్న చరిత్ర కొప్పులదేనంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత టెండర్లపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

ఒకవేళ టెండర్లలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే.. ఎలాంటి వణుకూ బెనుకూ లేకుండా తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి సవాల్ విసిరారు. మంత్రి అడ్లూరి విసిరిన రాజీనామా సవాల్‌పై కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) వెటకారంగా స్పందించారు. “రాజీనామా చేయడం అంత తమాషా కాదు.. దమ్ము, ధైర్యం ఉంటే నిజంగానే రాజీనామా చేసి చూపించు” అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతానికి రాజీనామాలు పక్కన పెట్టి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలో పట్టు కోసం ‘పోటాపోటీ’

ధర్మపురి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి అడ్లూరి, కొప్పుల మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. 2009 నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన కొప్పుల ఈశ్వర్ 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అడ్లూరి లక్ష్మణ్‌కు ఏకంగా కేబినెట్ బెర్త్ దక్కింది. దీంతో నియోజకవర్గంలో తన పట్టును మరింత బిగించేందుకు మంత్రి అడ్లూరి ప్రయత్నిస్తుండగా.. తన పట్టు సడలకుండా చూసుకునేందుకు కొప్పుల ఈశ్వర్ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.

ప్రభుత్వ అభివృద్ధి పనులు, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ హామీల అమలు వంటి అంశాలపై ఇరువర్గాలు వీధికెక్కి మరీ విమర్శలు చేసుకుంటున్నాయి. నేతల మధ్య నడుస్తున్న ఈ పోరు కాస్తా సోషల్ మీడియాకు సైతం పాకింది. ఇరు పార్టీల శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో పోలిటికల్ రచ్చను పీక్స్‌కు తీసుకెళ్లారు. రానున్న రోజుల్లో ఈ ధర్మపురి పొలిటికల్ ఫైట్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>