కలం, చర్ల : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల (Cherla) మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా జరిగాయి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చీమలమర్రి మురళి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. జెడ్పీటీసీ సభ్యునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి తన కృషి, పట్టుదల, ప్రజల పట్ల అంకితభావంతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రాజకీయాల్లో కష్టపడితే ఏ స్థాయికైనా చేరుకోవచ్చని ఆయన నిరూపించారని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేదల సంక్షేమాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని పాలన సాగిస్తోందని, ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని భరోసా ఇచ్చారు.
అనంతరం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు చీమలమర్రి మురళి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం యువతకు ఆదర్శమని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ప్రజాసేవా ప్రస్థానం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

