Mobile Popup Ad
Mobile Popup Ad

చెలరేగిన ఆర్‌సీబీ.. ముంబై టార్గెట్ 241..

కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs MI) పరుగుల సునామీ సృష్టించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఆర్‌సీబీ బ్యాటర్ల ధాటికి ముంబై బౌలింగ్ లైనప్ పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. అతనికి తోడుగా విరాట్ కోహ్లీ (50 పరుగులు, 38 బంతుల్లో) తనదైన శైలిలో అర్థసెంచరీతో మెరిశాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 120 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ముంబైని ఆత్మరక్షణలో పడేశారు.

వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ ముంబై (Mumbai Indians) బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 20 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 53 పరుగులు చేసి రన్ రేట్‌ను ఆకాశానికి తీసుకెళ్లాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (35* పరుగులు, 16 బంతుల్లో, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఆర్‌సీబీ స్కోరు 240 మార్కును అందుకుంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మినహా అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మయాంక్ మార్కండే 2 ఓవర్లలోనే 40 పరుగులు ఇవ్వగా, ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చుకున్నాడు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసినప్పటికీ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయారు. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ముంబై.. ఈ కొండంత స్కోరును ఎలా ఛేదిస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>