కలం, కరీంనగర్ బ్యూరో: ఆర్‌బీవీఆర్‌ఆర్ ఉమ్మడి జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం కరీంనగర్ (Karimnagar) లోని సీతారాంపూర్ సంఘ భవనంలో ఉద్రిక్త వాతావరణంలో జరిగింది. సుమారు 250 మంది సభ్యులు హాజరైన ఈ సమావేశంలో సంఘ భవిష్యత్తుకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పాత బైలాలోని పలు నిబంధనలకు సవరణలు ఆమోదించారు. అయితే సమావేశం ప్రారంభం నుంచి చివరి వరకు కొందరు సభ్యుల అభ్యంతరాలు, వాగ్వాదాలతో సమావేశం కొనసాగింది.
సభలో సభ్యత్వ రుసుమును ప్రస్తుతం ఉన్న రూ.5,000 నుంచి రూ.3,000కు తగ్గించాలని పలువురు సభ్యులు కోరగా.. కొందరు ఒప్పుకోలేదు. ఈ అంశంపై సభ్యుల మధ్య విస్తృత చర్చ జరిగింది. అలాగే సంఘ బైలాలోని పలు నిబంధనలను కాలానుగుణంగా సవరించి కొత్త అమెండ్మెంట్లను చేర్చాలని సమావేశం నిర్ణయించింది. అధ్యక్ష పదవి నామినేషన్ ఫీజు 50,000 నుండి తగ్గించాలని కోరిన తగ్గించడానికి సమావేశం ఒప్పుకోలేదు. విత్ డ్రా అయినవారి నామినేషన్ రుసుము తిరిగి చెల్లించాలని కోరినప్పటికీ తిరిగి ఇవ్వడానికి సమావేశం ఒప్పుకోలేదు.
సంఘ పారదర్శకతను పెంపొందించే దిశగా కీలక తీర్మానాలు కూడా చేశారు. సంఘంలో సభ్యత్వం కలిగిన ఏ వ్యక్తికి కూడా సంఘానికి సంబంధించిన కాంట్రాక్టు పనులు, అలాగే లీజులు ఇవ్వకూడదని సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సంఘ అభివృద్ధి పనులు, డెకరేషన్, లైటింగ్ తదితర పనులను పత్రికా ప్రకటన ద్వారా టెండర్లు ఆహ్వానించి, మూడేళ్ల కాలపరిమితికి కాంట్రాక్టులు కేటాయించాలని నిర్ణయించారు. అత్యధిక టెండర్ కోట్ చేసిన అర్హత కలిగిన వ్యక్తికి పనులు అప్పగించాలని సమావేశం అభిప్రాయపడింది.
ఇదే కాకుండా సంఘ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పాత బైలాలోని మరికొన్ని అంశాలను సవరించి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురావాలని తీర్మానించారు. కొంతమంది సిబ్బందిని మార్చాలని కూడా సభ్యుల నుంచి డిమాండ్ వ్యక్తమైంది. సమావేశంలో ఆర్‌బీవీఆర్‌ఆర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి, ప్రధాన కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి, అడ్‌హాక్ కమిటీ సభ్యులు ఉచ్చిడి మోహన్ రెడ్డి, బద్దం మోహన్ రెడ్డి, పెండ్యాల కేశవరెడ్డి, నాయకులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, దాసరి రాంరెడ్డి, కసిరెడ్డి రాణిరెడ్డి, గన్ను మహేశ్వర్ రెడ్డి, పింగిలి రవీందర్ రెడ్డి, రెడ్డి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వంచ సుదర్శన్ రెడ్డి, దారం శ్రీనివాస్ రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, కరీంనగర్ అర్బన్ బ్యాంక్ పీఐసీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, బైల సవరణ ఆమోదాన్ని జిల్లా రిజిస్టార్‌కు అడ్ హాక్ కమిటీ అందించనుంది.

