కలం, స్పోర్ట్స్: భారతదేశపు ప్రతిష్ఠాత్మక ‘క్వాంట్‌బాక్స్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2026’ క్లాసికల్ చెస్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లన్నీ డ్రాగా ముగిశాయి. ప్రస్తుతానికైతే ఫ్రాన్స్ గ్రాండ్ మాస్టర్ అలీరెజా ఫిరూజా (Alireza Firouzja) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత స్టార్ ఆటగాడు అర్జున్ ఇరిగైసి కంటే అర పాయింట్ ఆధిక్యంతో అతను టేబుల్ టాప్‌లో కొనసాగుతున్నాడు.
ఈ రౌండ్‌లో అర్జున్, ప్రణేష్ మధ్య జరిగిన మ్యాచ్‌కు లెజెండరీ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ మొదటి మూవ్ (కదలిక) ఇచ్చి మ్యాచ్‌ను ప్రారంభించడం విశేషం. ఈ అద్భుత క్షణాలను చూసేందుకు 500 మందికి పైగా అభిమానులు తరలివచ్చారు.
రౌండ్-రౌండ్ సాగిన పోరు..
ఈ టోర్నీని ఎంజీడీ1 (MGD1) సంస్థ నిర్వహిస్తోంది. మొత్తం ఎనిమిది మంది టాప్ గ్రాండ్ మాస్టర్లు రౌండ్-రాబిన్ పద్ధతిలో తలపడుతున్నారు. ఈ టోర్నీ విజేతలకు 75 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో పాటు విలువైన ఫిడే (FIDE) సర్క్యూట్ పాయింట్లు కూడా దక్కనున్నాయి.
టోర్నీ ప్రారంభంలో ఫిరూజా మొదటి రెండు మ్యాచ్‌లను గెలిచి దూసుకెళ్లాడు. ఆ తర్వాత శనివారం జరిగిన మూడో రౌండ్‌లో భారత్‌కు చెందిన అర్జున్ ఇరిగైసి పూర్తి పాయింట్ సాధించి టైటిల్ రేసును మరింత రసవత్తరంగా మార్చాడు.
నాలుగో రౌండ్ విశేషాలు..
ఆదివారం జరిగిన నాలుగో రౌండ్‌లో తెల్లటి కాయిన్స్‌తో ఆడిన అర్జున్ ఇరిగైసి.. తన తోటి భారత ఆటగాడు ఎం.ప్రణేష్‌తో తలపడ్డాడు. ఈ మ్యాచ్ మొదటి నుంచి చివరి వరకు సమవుజ్జీగా సాగడంతో 34 మూవ్స్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. మరోవైపు ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్ నల్లటి కాయిన్స్‌తో నోదిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్‌ను ఓడించడానికి గట్టిగానే ప్రయత్నించాడు.
కానీ, 41 మూవ్స్ తర్వాత ఈ మ్యాచ్ కూడా డ్రాగానే ముగిసింది. అగ్రస్థానంలో ఉన్న ఫిరూజా సైతం హాన్స్ నీమన్‌పై జాగ్రత్తగా ఆడి 50 మూవ్స్ తర్వాత మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు.
నాలుగో రౌండ్ ఫలితాలు:
జీఎం హాన్స్ నీమన్ (1.5) – జీఎం అలీరెజా ఫిరూజా (3) — డ్రా
జీఎం దిమిత్రి ఆండ్రీకిన్ (2) – జీఎం నిహాల్ సరిన్ (2) — డ్రా
జీఎం నోదిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్ (2) – జీఎం డి. గుకేష్ (1.5) — డ్రా
జీఎం అర్జున్ ఇరిగైసి (2.5) – జీఎం ఎం. ప్రణేష్ (1.5) — డ్రా

