కలం, స్పోర్ట్స్ : ఫిఫా వరల్డ్ కప్‌లో (FIFA World Cup) కొత్త రికార్డు సృష్టించిన కైలియన్ ఎంబాప్పే.. ఆశ్చర్యకరంగా లియోనెల్ మెస్సీకే మద్దతుగా నిలిచాడు. ఫైనల్లో స్పెయిన్‌పై మెస్సీ తప్పకుండా గోల్ చేస్తాడని చెప్పాడు. దీంతో ఆల్‌టైమ్ టాప్ స్కోరర్ రికార్డు మళ్లీ మెస్సీదే అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో స్థానం మ్యాచ్‌లో ఎంబాప్పే రెండు గోల్స్ చేశాడు. దీంతో వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతడి ఖాతాలో ఇప్పుడు 22 గోల్స్ ఉన్నాయి. మెస్సీ 21 గోల్స్‌తో రెండో స్థానానికి చేరాడు. అయితే ఈ రికార్డు ఎక్కువసేపు తన దగ్గర ఉండదని ఎంబాప్పే భావించాడు. మెస్సీ ఎప్పుడూ గోల్స్ చేస్తాడని, ఫైనల్లో కూడా తప్పకుండా గోల్ చేస్తాడని తెలిపాడు.
ఈ టోర్నీకి ముందు మెస్సీ, ఎంబాప్పే ఇద్దరూ మిరోస్లావ్ క్లోజే రికార్డును ఛేదించే లక్ష్యంతో బరిలోకి దిగారు. ముందుగా మెస్సీ ఆ రికార్డును అధిగమించాడు. కానీ మూడో స్థానం మ్యాచ్‌లో ఎంబాప్పే రెండు గోల్స్ చేసి మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. 2026 వరల్డ్ కప్‌లో ఎంబాప్పే అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో 10 గోల్స్ చేశాడు. 2018, 2022, 2026 వరల్డ్ కప్‌లను కలిపి అతడి మొత్తం గోల్స్ 22కి చేరాయి. ఈ గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో కూడా ఎంబాప్పే ముందంజలో ఉన్నాడు. మెస్సీ కంటే రెండు గోల్స్ ఆధిక్యంలో నిలిచాడు.
అయితే ఈ వ్యక్తిగత రికార్డు తనకు పూర్తి సంతృప్తి ఇవ్వలేదని ఎంబాప్పే అభిప్రాయపడ్డాడు. చరిత్రలో టాప్ స్కోరర్‌గా నిలవడం కంటే ఫైనల్ ఆడాలని తనకు ఎక్కువగా అనిపించిందని పరోక్షంగా తెలిపాడు. ఇప్పుడు అందరి చూపు అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్‌పైనే ఉంది. మెస్సీ గోల్ చేస్తే.. వరల్డ్ కప్ ఆల్‌టైమ్ టాప్ స్కోరర్ రికార్డు మరోసారి అతడి ఖాతాలోకి వెళ్లనుంది.

