రేషన్ బియ్యం పక్కదారి.. సైలెంట్‌మోడ్‌లో అధికారులు

కలం, కరీంనగర్ బ్యూరో: రేషన్ బియ్యం (Ration Rice)  అక్రమరవాణాకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే  సన్న బియ్యం పంపిణీ చేస్తున్నది. రేషన్ కార్డు హోల్డర్లంతా సన్నబియ్యం తింటున్నారని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. అధికారుల పట్టింపులేకపోవడంతో సన్న బియ్యం కూడా యథేచ్ఛగా  దారిమళ్లుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం దారిమళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చింది. అయినప్పటికీ బియ్యం మాత్రం పక్కదారి పడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

దారిమళ్లుతున్న బియ్యం

రేషన్ షాపుల్లో దాదాపు 30 శాతం మంది లబ్దిదారులు వేలిముద్రలు వేసి డీలర్లకే ఆ బియ్యం అమ్మేసి నగదు తీసుకునేలా ప్రోత్సహిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. రేషన్ బియ్యాన్ని దళారుల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తూ రాత్రి వేళల్లో మహారాష్ట్ర, ఇతర రైలు మార్గాల ద్వారా వివిధ రాష్ట్రాలు, విదేశాలకు తరలించి భారీగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో దూకుడుగా పనిచేసిన విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ తనిఖీలు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు.

కరీంనగర్ జిల్లాలో పరిస్థితి ఇది..

ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే మొదటి వారంలోనే దాదాపు మూడో వంతు రేషన్ బియ్యం దుకాణాల్లో స్టాక్ అయిపోతుందని అంటున్నారు. బియ్యం అవసరమైన లబ్దిదారులు బియ్యం తీసుకెళ్తుంటే మరికొందరు రేషన్ కార్డు హోల్డర్లు వేలిముద్రలు వేసి నగదు తీసుకెళ్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు పెద్దగా తనిఖీలు చేయకపోవడంతో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది.

ఇతర రాష్ట్రాలకు తరలింపు

సదరు బియ్యం (Ration Rice) రేషన్ షాపుల నుంచి వ్యాపారుల వద్దకు అక్కడి నుంచి రాత్రి వేళల్లో ఇతర రాష్ట్రాలకు తరలుతున్నట్టు సమాచారం. ఇదంతా జరుగుతున్నా ఆయా జిల్లా అధికార యంత్రాంగం అక్రమ రవాణాను నియంత్రించలేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కరీంనగర్ జిల్లాలో 566 రేషన్ షాపులున్నాయి. 3.13 లక్షలకుపైగా కార్డుదారులున్నారు. 10 లక్షల వరకు లబ్దిదారులున్నారు. ప్రతి నెల 6 వేల మెట్రిక్ టన్నులకు పైగా రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణ కొరవడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గత ఫిబ్రవరి 26న ఒకే రోజు నగరంలో మూడు చోట్ల నిల్వ ఉంచిన గోదాంలో, తరలిస్తున్న వాహనంలో మొత్తంగా 70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రూరల్ పోలీసులు సీజ్ చేశారు.

భారీ అవినీతికి స్కెచ్ వేశారా?

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి ఒకేసారి మూడు నెలలు రేషన్ బియ్యం అందించనున్నది. దీంతో పెద్దమొత్తంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నలుగురు కుటుంబ సభ్యులున్న కుటుంబానికి నెలకు రూ.20 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం నెలకు ఐదు వేల వరకు, ఏడాదికి రూ.56 వేలకు పైగా ఖర్చు చేస్తోంది. ఆ బియ్యాన్ని ప్రభుత్వం కిలోకు రూ.38 రూపాయల వరకు లబ్దిదారులకు ఖర్చు చేస్తోంది. కాగా రేషన్ దుకాణాదారులు కొంతమంది లబ్దిదారుల వేలి ముద్రలు తీసుకుని వారికి కిలోకు 12 నుంచి 15 రూపాయల నగదు ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సదరు బియ్యాన్ని రేషన్ మాఫియాతో కుమ్మక్కై కిలోకు రూ.30 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు: డీఎస్‌వో

‘రేషన్ కార్డు లబ్దిదారులు బియ్యం తీసుకుని అవసరాలకు వాడుకోవాల్సిందే. ప్రతి నెలా జిల్లాకు 6 వేల టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. ప్రతి డీలర్ కు 100 క్వింటాళ్ల వరకు బియ్యం సరఫరా చేస్తున్నాం. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆయా డిటిసిఎస్, ఫుడ్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలిస్తున్నాం. ప్రతి నెలా డీలర్ వద్ద స్టాక్, లబ్దిదారుల బయోమెట్రిక్ ను పరిశీలించి తేడా వస్తే గుర్తించి డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అలాంటి ఫిర్యాదులు రాలేదు.. ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవు.’ అని డీఎస్‌వో నర్సింగరావు (DSO Narsingarao) పేర్కొన్నారు.

Read Also: తమిళ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ.. TVK, NDA పొత్తుకు కీలక చర్చలు!

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>