కలం, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఉన్న ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమంలో సాధకుడిగా ఉన్న రసిక్ దులారి (Rasik Dulari) అనుమానాస్పద మృతి వెనుక విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబర్ 25న ఉదయం 10.25 గంటలకు తన గదిలో నుంచి బయటకొచ్చిన రసిక్ దులారి.. నేరుగా భవనంపైకి వెళ్లి నాలుగో అంతస్తు నుంచి దూకి మరణించాడు. అంతకంటే ముందు గ్రైండర్తో తన ప్రైవేట్ పార్ట్ కట్ చేసుకుని మెట్లు ఎక్కినట్లు సీసీ టీవీలో స్పష్టంగా తెలుస్తోంది. రక్తంతోనే నాలుగో అంతస్తు వరకు ఎలా వెళ్లారనేది మిస్టరీగా మారింది. నొప్పి లేకుండా ఉండేందుకు మత్తు పదార్థాలు ఏమైనా తీసుకున్నారా.. అనే అనుమానం కలుగుతోంది.
లోతుగా దర్యాప్తు..
ఆశ్రమంలో చేరిన వ్యక్తి ఫోన్‌ను నిర్వాహకులు స్వాధీనం చేసుకుని.. కొత్త ఫోన్, సిమ్ కార్డు ఇస్తుంటారు. ఇది తప్ప ఆశ్రమంలో ఇంకా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటానికి వీలుండదు. అంతేగాకుండా ఆశ్రమంలో ఐసోలేషన్ వంటి వాతావరణం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన కాల్ డేటా రికార్డును పరిశీలిస్తున్నారు. ఎవరెవరితో మాట్లాడారనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
అంతేగాకుండా ఆశ్రమంలో ఎలా ఉండేవారు .. అతడి మానసిక పరిస్థితిలో ఏమైనా మార్పులు గమనించారా.. అని 85 మంది నుంచి వివరాలు సేకరించారు. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాల ప్రకారం నాలుగో అంతస్తు వరకు వెళ్లి అక్కడ పది నిమిషాలు కూర్చుని.. ఆ తరువాతనే కింద దూకాడు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మరణించాడు. మరణానికి ముందు అంతా మిస్టరీగా ఉండటంతో మథుర పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఎవరీ ప్రేమానంద్ మహారాజ్..?
మథురలో ఆశ్రమం స్థాపించుకున్న ప్రేమానంద్ మహారాజ్ అసలు పేరు అనిరుద్ధ కుమార్ పాండే. ఈయనకు దేశ విదేశాల్లో ఎంతో గుర్తింపు ఉంది. విరాట్ కోహ్లీ వంటి స్టార్ సెలెబ్రిటీలు కూడా ఈయన వద్దకు తరచూ వచ్చి.. ఆధ్యాత్మిక చింతనలో కాసేపు గడిపి వెళ్తుంటారు. సోషల్ మీడియాలో కూడా ప్రేమానంద్ మహారాజ్‌కు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లున్నారు. తన బోధనలతో ప్రజలను ఎంతో ఆకట్టుకుంటుంటారు. ఆయన ఆశ్రమంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై ఇప్పటివరకు ప్రేమానంద్ మహారాజ్ స్పందించలేదని సమాచారం.

