2036 ఒలింపిక్స్ రేసులో భారత్

కలం, స్పోర్ట్స్ : 2036 ఒలింపిక్స్ (2036 Olympics), పారాలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలన్న భారత స్వప్నం మరో కీలక అడుగు ముందుకు పడింది. ఈ క్రీడల నిర్వహణ రేసులో భారత్‌తో పాటు మరో ఆరు దేశాలు ఉన్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ప్రకటించింది. పోటీదారులను ఎంపిక చేసే విధానానికి సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన కొత్త హ్యాండ్‌బుక్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మంగళవారం నాడు విడుదల చేసింది. ప్రస్తుతం భారత్‌తో పాటు జర్మనీ, హంగేరీ, ఖతార్, దక్షిణ కొరియా, దక్షిణ ఆఫ్రికా, తుర్కియే దేశాలు ఒలింపిక్స్ నిర్వహణపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.

మన దేశంలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత పెద్ద క్రీడా ఉత్సవాన్ని నిర్వహించాలనే లక్ష్యంతో భారత ఒలింపిక్ సంఘం ఈ ప్రయత్నాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగానే 2036 పోటీల నిర్వహణపై తన ఆసక్తిని వ్యక్తం చేస్తూ 2024 అక్టోబర్ 1వ తేదీన భారత ఒలింపిక్ సంఘం అంతర్జాతీయ కమిటీకి అధికారికంగా లేఖ పంపింది. ఈ ఎంపిక విధానంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు కిర్స్టీ కోవెంట్రీ స్పందిస్తూ క్రీడాకారుల అనుభవానికే తమ ప్రాధాన్యమని తెలిపారు. తను స్వయంగా ఐదు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు.

వేదిక ఏదైనా ఆడే అథ్లెట్ల సంక్షేమం, వారికి కల్పించే సౌకర్యాలే అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఆతిథ్యం ఇచ్చే ఏ దేశమైనా క్రీడాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించడమే ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకోవాలని ఆమె స్పష్టం చేశారు.కొత్తగా ప్రకటించిన గడువుల ప్రకారం 2026 నవంబర్ నాటికి ఆసక్తి ఉన్న దేశాలు వర్చువల్ ప్రెజెంటేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది.

2027 మార్చి నాటికి సాంకేతిక, వ్యూహాత్మక అంశాలను పరిశీలించి కమిటీ తుది జాబితాను సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత 2028 డిసెంబర్‌లో అర్హత సాధించిన దేశాలతో కీలక చర్చలు జరుగుతాయి. అన్ని వివరాలు, హామీలను సమీక్షించిన తర్వాత 2029 మధ్యలో జరిగే కమిటీ సమావేశంలో 2036 ఒలింపిక్స్ (2036 Olympics) ఆతిథ్య దేశాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>