కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh) మైసూర్ చాముండేశ్వరీ ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. కాసేపు గుడిలో కూర్చుని ఆలయ విశేషాలను పూజారులను అడిగి తెలుసుకున్నారు. కాంతార సినిమా వివాదంలో భాగంగా రణవీర్ సింగ్‌పై నమోదైన కేసుని కర్ణాటక హైకోర్ట్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. చాముండేశ్వరీ ఆలయాన్ని దర్శించుకోవాలని ఆదేశించడంతో ఈ మేరకు రణవీర్ గుడికి వచ్చి పూజలు నిర్వహించారు. దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది.
అసలు ఏం జరిగిందంటే..
గతేడాది గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో పాల్గొన్న రణ్‌వీర్ సింగ్.. స్టేజిపై కాంతార మూవీలో నటుడు రిషభ్ శెట్టి ప్రదర్శించిన భూత కోల నృత్యాన్ని కళ్లు పెద్దవి చేసి, నాలుక బయటపెట్టి చులకనగా అభినయించాడు. దీనిపై కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో, అప్పుడే క్షమాపణలు కోరాడు. రణవీర్ చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఓ లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్ట్.. ఇతరుల మనోభావాలను కించపరిచే హక్కు రణవీర్ సింగ్‌కు లేదని, మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తంగా చాముండేశ్వరీ ఆలయాన్ని సందర్శించి భక్తిని చాటుకోవాలని సూచించింది. దీంతో, సామాన్యుడిలా గుడికి వచ్చిన రణవీర్.. అమ్మవారికి పూజలు నిర్వహించారు.

