కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru-Rangareddy Project) పనులు పూర్తి చేసి.. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాకు త్రాగునీరు ఇచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు వేగంగా పూర్తి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally) అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ మొదటి వారంలో ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించనున్న నేపథ్యంలో మంత్రి మంగళవారం ఎదుల రిజర్వాయర్‌ను సందర్శించి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణలతో కలిసి పంప్ హౌస్‌ను పరిశీలించి అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాజెక్టు ఐదు దశల్లో రూపుదిద్దుకోగా, శ్రీశైలం జలాలను ఎత్తిపోతల ద్వారా నార్లపూర్ (అంజనగిరి) రిజర్వాయర్‌కు తరలించి అక్కడి నుంచి ఎదుల రిజర్వాయర్‌ను నింపనున్నారు. 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఎదుల రిజర్వాయర్ నుంచి వట్టేం, కరివేన, ఉదండపూర్, కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లకు నీరు సరఫరా చేయనున్నారు.
ఎదుల సర్జిపుల్ నుండి 134 మీటర్ల ఎత్తున ఉన్న రిజర్వాయర్ నింపడానికి 10 మోటార్లు ఏర్పాటు చేయడం జరిగిందని, రోజుకు రెండు టి.యం.సి ల నీటిని ఎత్తిపోసేందుకు ఒక్కో పంపు 1.45 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలిపారు. సంవత్సరంలో 45 రోజుల పాటు 90 టి.యం.సి ల నీటిని ఎత్తిపోసేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రాజెక్టులలో ఉన్న సమస్యలు, అవాంతరాలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

