కలం, ఖమ్మం బ్యూరో: సాంకేతికత పెరిగింది.. పాలన పారదర్శకంగా మారుతోందని ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలకు పొంతన లేకుండా పోతోంది. ఖమ్మం (Khammam) జిల్లా రఘునాథపాలెం మండలంలో వెలుగుచూసిన ఉదంతాలు ప్రభుత్వ కార్యాలయాల్లోని నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఎంతోమంది వృద్ధులను కాగితాల్లో రికార్డులకెక్కించి, వారికి డెత్ సర్టిఫికెట్లు జారీ చేయడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. “నేను చనిపోలేదు సార్.. బతికే ఉన్నాను” అంటూ బాధితులు అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమవుతున్న తీరు వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది.
రాములమ్మ దీనగాథ
రఘునాథపాలెం మండలానికి చెందిన కొండ్రు రాములమ్మ అనే వృద్ధురాలి భర్త రెండేళ్ల క్రితం మృతి చెందాడు. రాములమ్మ వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నది. అయితే, అధికారులు ఆన్‌లైన్ డేటా ఎంట్రీలో చేసిన ఘోర తప్పిదం వల్ల ఆమెనే ‘మరణించిన వ్యక్తి’గా నమోదు చేశారు. ఫలితంగా ఆమెకు రావాల్సిన పింఛన్ ఆగిపోవడమే కాకుండా, బతుకుదెరువుకు ఆధారమైన రేషన్ బియ్యం కూడా నిలిచిపోయింది. ఇటీవల ఆమె మనవడు ఆన్‌లైన్‌లో పింఛన్ స్టేటస్ పరిశీలించగా, ఎవరూ దరఖాస్తు చేయకుండానే ఆమె పేరున డెత్ సర్టిఫికెట్ జారీ అయినట్లు తెలిసి కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లిన ఆ వృద్ధురాలు “బతికుండగానే నన్ను చంపేశారు సార్” అంటూ అధికారుల కాళ్లపై పడి వేడుకోవడం అక్కడున్న వారిని తీవ్రంగా కలిచివేసింది.
బతికున్న వృద్ధుడిని చంపేశారు
ఇదే గ్రామానికి చెందిన కొమ్ము పుల్లయ్య పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఐదేళ్ల క్రితం ఆయన భార్య పుల్లమ్మ చనిపోతే, అధికారులు పొరపాటున పుల్లయ్య చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఐదేళ్లుగా పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఆయనకు, “నువ్వు రికార్డుల ప్రకారం చనిపోయావు” అని అధికారులు చెప్పడంతో షాక్‌కు గురయ్యాడు. రాములమ్మ ఉదంతం బయటకు రావడంతో పుల్లయ్య కూడా తన ఆవేదనను వ్యక్తపరిచాడు.
స్పందించని ఎంపీడీవో
ఈ తీవ్రమైన తప్పిదాలపై స్థానిక ఎంపీడీవో అశోక్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన ఫోన్‌కు స్పందించకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. భర్త లేదా భార్య చనిపోతే, దరఖాస్తుదారు కాలమ్‌లో ఉన్న బతికున్న వ్యక్తి వివరాలను మరణించిన వారిగా నమోదు చేయడం, కనీసం క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేయకుండానే కార్యాలయాల్లో కూర్చుని డిజిటల్ సంతకాలు చేయడం వల్లే ఇటువంటి మానవీయ లోపాలు జరుగుతున్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు.
వృద్ధుల కడుపు కొడతారా?
ఈ ఘటన కేవలం సాంకేతిక లోపం కాదు, నిరుపేద వృద్ధుల ఆత్మగౌరవాన్ని, జీవనాధారాన్ని దెబ్బతీసే అంశమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రఘునాథపాలెం మండలంలో వేలసంఖ్యలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, వాటిని సక్రమంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఖమ్మం జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని, తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

