కలం, వెబ్ డెస్క్: దేశ సమగ్ర ప్రగతికి ప్రజా భాగస్వామ్యం అత్యంత కీలకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు (Ramchander Rao) అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులపై రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు రామ్ చందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ‘జన్ భాగీదారీ’ (ప్రజా భాగస్వామ్యం) అనేది అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ జాతీయ యజ్ఞంలో తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సూచనలకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన (Ramchander Rao) స్పష్టం చేశారు. మోదీ సూచనలు దేశ ఆర్థిక భద్రత, సామాజిక బాధ్యత, దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలకు ముడిపడి ఉన్న అంశాలని పేర్కొన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’ అనే స్ఫూర్తితో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ, మన దేశీయ ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవడంతోపాటు దాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ప్రజలు అనవసర ఖర్చుల విషయంలో సంయమనం పాటించాలన్నారు. తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకోవడం ద్వారా స్వయంగా ప్రధానమంత్రే దేశ ప్రజలందరికీ గొప్ప ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రధాని ఇచ్చిన ఈ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని జాతి నిర్మాణంలో చురుకుగా పాల్గొనాలని రాష్ట్ర ప్రజానీకానికి మరోసారి విజ్ఞప్తి చేశారు.
Read Also: ప్రధాని పొదుపు మంత్రంతో తెలంగాణకు చిక్కులు
Follow Us On: Instagram

