కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరానికి ఇప్పుడు నిర్ణయాత్మకమైన మార్పు అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు (Ramchander) వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తప్పుడు వాగ్దానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలతో నగరప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. కూకట్ పల్లిలో రాష్ట్ర మైనారిటీ మోర్చా, పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీలోకి పెద్ద ఎత్తున మైనారిటీ యువతను ఆయన స్వాగతించారు. ‘దేశమే ప్రథమం’ అనే ఏకైక స్పష్టమైన ఎజెండాతో పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని వివరించారు.
కుటుంబ పాలక పార్టీలు ఓటు బ్యాంకులను సృష్టించుకోవడంపై దృష్టి పెడితే, మోదీ ప్రభుత్వం మాత్రం నిష్పక్షపాతంగా ఏ ఒక్కరి మతాన్ని చూడకుండా పనిచేస్తుందని అన్నారు. అందుకే పీఎం ఆవాస్ యోజన, పీఎం ముద్రా యోజన లాంటి ప్రతిష్టాత్మక పథకాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాయని చెప్పారు. ఇందులో మైనారిటీ వర్గాలకు చెందిన లబ్ధిదారులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని అన్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపాలి..
నకిలీ లౌకికవాద శక్తులు వ్యాప్తి చేస్తున్న దుష్ప్రచారానికి భిన్నంగా మైనారిటీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీకి ప్రజల మద్దతు లభించిందని వ్యాఖ్యానించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపాలని కోరారు. హైదరాబాద్‌ను రక్షించుకునే ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘దేశమే ప్రథమం, అందరికీ అభివృద్ధి.. ఎవరికీ బుజ్జగింపులు లేవు’ అనే స్ఫూర్తితో పనిచేసేలా బీజేపీని మరింత బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

