కలం, వెబ్ డెస్క్ : రామప్ప దేవాలయానికి (Ramappa Temple) సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు చేశారు.
రామప్ప ఆలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు తవ్వకాలు (Open-Cast Coal Mine) చేపట్టడం వల్ల చారిత్రక కట్టడానికి, పరిసర ప్రాంతాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భంలో మీటర్ల మేర తవ్వకాలు, బ్లాస్టింగ్స్ నిర్వహిస్తే రామప్ప దేవాలయ నిర్మాణంపై ప్రభావం పడటంతో పాటు రామప్ప చెరువుకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ శిల్పకళకు ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు ఉందని కేటీఆర్ (KTR)గుర్తుచేశారు. ఇలాంటి చారిత్రక, వారసత్వ ప్రదేశానికి సమీపంలో భారీ స్థాయిలో బొగ్గు తవ్వకాలు చేపట్టే ప్రతిపాదనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
రామప్ప ప్రాంతంలోని వారసత్వ సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. చారిత్రక కట్టడాలకు హాని కలిగించే నిర్ణయాలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఓపెన్ కాస్ట్ గని ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.
రామప్ప ఆలయం(Ramappa Temple), చెరువు పరిరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనుల పేరుతో వారసత్వ సంపదకు నష్టం కలగకుండా చూడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read : మెస్సీ చివరి మ్యాచ్‌కు రెడీ!
Follow Us On: X(Twitter)

