కలం, కరీంనగర్ బ్యూరో : రామగుండం(Ramagundam) ప్రాంత సమగ్ర అభివృద్ధికి కీలకమైన 1×800 మెగావాట్ల బీ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాగూర్ (MLA Raj Thakur) కోరారు. సోమవారం హైదరాబాదులో పలువురు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే, రామగుండం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పవర్ ప్లాంట్ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించిన ఆయన, దీని ద్వారా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరగడంతో పాటు స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అలాగే అనుబంధ పరిశ్రమల అభివృద్ధితో రామగుండం ప్రాంత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి, అంతర్గత రహదారుల విస్తరణ, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా మెరుగుదల, వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు, పార్కుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే ప్రజలకు మెరుగైన వైద్య, విద్యా సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ఆధునిక పట్టణ సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని ఆయన అభ్యర్థించారు. రామగుండం పారిశ్రామిక నగరంగా ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఎమ్మెల్యే వినతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, రామగుండం అభివృద్ధి ప్రతిపాదనలను పరిశీలించి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రామగుండం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో తాను నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాగూర్ స్పష్టం చేశారు.

