ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: సీపీ అంబర్ కిశోర్ ఝా

కలం, పెద్దపల్లి: ప్రజలు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు భరోసా కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని,ప్రజల భద్రత కోసం శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని రామగుండం పోలీస్ (Ramagundam Police) కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంచికల్‌పేట్ గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ పర్యవేక్షణలో, టూ టౌన్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్ రావు, లింగమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై ప్రత్యేక నిఘా చేపట్టడంతో పాటు అనుమానాస్పద ప్రాంతాలు, నివాస గృహాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పత్రాలు లేని 70 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా గ్రామ ప్రజలతో మాట్లాడి వారి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీసులు పెట్రోలింగ్ వాహనాలు,బ్లూ కోల్ట్స్‌తో పాటు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇతర వనరులను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని తెలిపారు. అయితే, పోలీసుల చట్టపరమైన చర్యలకు, నేరాల నియంత్రణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

గ్రామంలో లేదా తమ ప్రాంతంలో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.తమకు తెలిసిన వారు, కుటుంబ సభ్యులు లేదా పరిచయస్తులు ఎవరైనా తప్పు చేసినా, నేరాలకు పాల్పడినా వాటిని దాచిపెట్టకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.నేరాన్ని ప్రారంభ దశలోనే అడ్డుకుంటే భవిష్యత్తులో తలెత్తే పెద్ద సమస్యలను నివారించవచ్చన్నారు. గతంతో పోలిస్తే నేరాల స్వభావంలో మార్పులు వస్తున్నాయని సీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లలు పరస్పర అవగాహనతో ఉండాలని సూచించారు.

యువత తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కష్టపడి చదవాలని,క్రీడల్లో రాణించాలని సీపీ సూచించారు.తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని అందులో ముందుకు సాగి దేశానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. పని లేకుండా చెడు మార్గాల్లోకి వెళ్లడం వల్ల తల్లిదండ్రులతో పాటు సమాజానికి,ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. యువత ఉద్యోగ సాధనకు అవసరమైన శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి పోలీసుల తరఫున సాధ్యమైనంత సహకారం అందిస్తామని తెలిపారు. అవసరమైతే ఇతర ప్రభుత్వ శాఖల సహకారంతో యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సింగరేణి సంస్థలో అందుబాటులో ఉన్న అవకాశాలను కూడా యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కష్టపడి పనిచేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని, యువత క్రమశిక్షణతో, లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలోని సీనియర్ పౌరులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను చట్టబద్ధంగా నిర్వహించాలని, చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే డయల్-112కు కాల్ చేయాలని లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ఇన్స్పెక్టర్లు ప్రసాద్ రావు, లింగమూర్తి, గోదావరిఖని టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్జాలొద్దీన్, కమాన్‌పూర్ ఎస్‌ఐ ప్రసాద్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>