కలం, సినిమా : ఐటీ సోదాలకు (IT Raids) సంబంధించి తనపై వస్తున్న వార్తలపై నటి రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) స్పందించారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా కొందరు ఆన్లైన్ రిపోర్టర్లు, మీడియా ప్రతినిధులు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ సోదాలు తనకు సంబంధించినవి కాదని స్పష్టం చేశారు. తాను ఆర్మ్డ్ ఫోర్సెస్ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చానని, సినీ పరిశ్రమలో తనకు ఎలాంటి గాడ్‌ఫాదర్ లేరని రకుల్ తెలిపారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, 20 ఏళ్ల వయసు నుంచే క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నానని పేర్కొన్నారు.
తాను వ్యక్తిగతంగా గానీ, ఏదైనా ప్రొడక్షన్ హౌస్ తరఫున గానీ అక్రమ విదేశీ నగదు బదిలీలకు పాల్పడలేదని రకుల్ స్పష్టం చేశారు. దేశంలో లేదా విదేశాలలో ఎవరి తరఫునా తనకు బినామీ ఆస్తులు లేవని తెలిపారు. అలాగే ఎవరూ తనకు ఎప్పుడూ ఖరీదైన ఆస్తులను బహుమతిగా ఇవ్వలేదని చెప్పారు. అలాంటి ఖరీదైన బహుమతులను స్వీకరించడం తన విధానం కాదని పేర్కొన్నారు. తనపై తప్పుడు, ఊహాగానాలతో కూడిన వార్తలు ప్రచారం చేసిన వారు వాటిని వెంటనే ఉపసంహరించుకుని వాస్తవాలను వెల్లడించాలని రకుల్ కోరారు. మీడియా సంస్థలకు వాణిజ్యపరమైన ఒత్తిళ్లు ఉంటాయని అర్థం చేసుకోగలనని, అయితే అవి వాస్తవాల కంటే ముఖ్యమైనవి కాదని అన్నారు. తప్పుడు వార్తల వల్ల ఒక వ్యక్తి ప్రతిష్ఠ, జీవనోపాధికి నష్టం కలగకూడదని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.

