కలం, వెబ్ డెస్క్: సింగరేణి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లక్డీకాపూల్లోని ‘సింగరేణి భవన్’ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్మికులు, నాయకులు ముట్టడించారు. వందలాది మంది పార్టీ శ్రేణులు, హెచ్ఎంఎస్ కార్మిక నాయకులతో కలిసి ఆమె భవన్ ఎదుట రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కార్మికులకు చెల్లించాల్సిన ప్రాఫిట్ షేరింగ్ శాతాన్ని పెంచడంతో పాటు, గనుల్లో కఠిన శ్రమతో అనారోగ్యం పాలవుతున్న కార్మికుల వారసులకు ఇచ్చే డిపెండెంట్ ఉద్యోగాల విధానాన్ని పునరుద్ధరించాలని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు. అలాగే మెడికల్ బోర్డు నిర్వహణ కేవలం ఒక మొక్కుబడి ప్రక్రియలా మారడంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి సింగరేణి కార్మికుడికి సమగ్రంగా పరీక్షలు నిర్వహించి, వారిని ‘అన్ఫిట్’గా నిర్ధారించి వారసులకు తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
అయితే సింగరేణి యాజమాన్యం దిగి వచ్చి చర్చలు జరిపింది కాబట్టి వారికి రెండు నెలల సమయం ఇస్తున్నామని కవిత అన్నారు. ఆలోగా మెడికల్ బోర్డు ద్వారా అనారోగ్యంతో ఉన్న కార్మికుల అన్ఫిట్ శాతం కనీసం 80 శాతానికి చేరాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన సమయానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే లేదా ఈ విధానంలో మార్పు రాకపోతే, తదుపరి చర్యగా సింగరేణి భవన్ ప్రధాన గేటు ముందే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

