కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో మద్యం పాలసీపై హాట్‌హాట్‌గా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి (MLA Rakesh Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పపువ్వు సారాను ప్రజలకు అందుబాటులోకి తెస్తే.. దానికి ఇందిరాగాంధీ పేరు పెట్టొద్దని అన్నారు. ఈ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఏం తమాషాగా ఉందా రాకేశ్ రెడ్డి అంటూ పొన్నం ప్రభాకర్ విరుచుకుపడ్డారు. సారా అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు సభలో ఇందిరమ్మ పేరు తీసినందుకు రాకేశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఆగ్రహానికి గురైన సీతక్క మాట్లాడుతూ.. ఇప్ప పువ్వు సారా అంశంలో ఇందిరమ్మ పేరు ఎత్తడం మహిళలను అవమానించామేనన్నారు. సంక్షేమ పథకాలకు గొప్పవారి పేర్లు పెడతారని, అందుకే ఇందిరమ్మ పేర్లు పథకాలకు పెట్టామని చెప్పారు. బీజేపీ నేతలు ఇందిరమ్మ మీద ఇంకా అక్కసు ప్రదర్శిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రుల మాటలకు బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) స్పందించారు. తమ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
తన వ్యాఖ్యల పట్ల మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి (MLA Rakesh Reddy) స్పందించారు. ఇందిరాగాంధీ ఉక్కుమహిళ అని.. ఆమె అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇప్పసారా తయారీ కేంద్రం ఉండాలని సూచించినట్లు తెలిపారు. ప్రతి పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టడం కాంగ్రెస్ వాళ్లకు అలవాటు అని.. ఇప్పసారా పథకానికి మాత్రం ఆ పేరు పెట్టవద్దని తాను సూచించినట్లు వివరించారు. ఇందిరమ్మ పేరు పెట్టవద్దని చెప్పడం తప్పా? అని అడిగారు. తాను చేసిన సూచనలో ఎలాంటి తప్పు లేదన్నారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ నేత మాత్రమే కాదని.. భారత మాజీ ప్రధాని అని పేర్కొన్నారు. ఇందిరాగాంధీపై గౌరవంతోనే ఆ పేరు పెట్టవద్దని చెప్పానని అన్నారు.
Read Also: ఈ వేసవిలో ఇంట్లోనే కర్బూజా పండ్లను పండించండిలా!
Follow Us On: Instagram

