కలం, వెబ్ డెస్క్ : మైదానంలో అదరగొడుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టును.. వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఆటగాళ్ల ప్రవర్తన వల్ల టీమ్ పరువు పోతోందని కోచ్ కుమార్ సంగక్కర (Kumar Sangakkara) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు జట్టుపై నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయని ఆయన (Kumar Sangakkara) ఆవేదన చెందారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ టీమ్ రెండు ప్రధాన వివాదాల్లో చిక్కుకుంది. మొదట, టీమ్ మేనేజర్ రవీందర్ సింగ్ భిందర్ నిబంధనలకు విరుద్ధంగా డగౌట్‌లో మొబైల్ ఫోన్ వాడారు. దీనికి సంబంధించి బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ ఆయనకు లక్ష రూపాయల జరిమానా విధించింది.
ఇది మరువకముందే.. కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కారు. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడింది. ఈ ఘటనలపై స్పందించిన సంగక్కర.. ఇలాంటి వివాదాలు జట్టుకు మంచిది కాదని స్పష్టం చేశారు. వీటిపై ఇప్పటికే బీసీసీఐ, ఫ్రాంచైజీ చర్యలు తీసుకున్నాయని తెలిపారు. జట్టు విలువలను, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. ఆటగాళ్లు మైదానంలోనే కాదు, బయట కూడా బాధ్యతాయుతంగా ఉండాలని.. ఫ్యాన్స్‌పై మంచి ప్రభావం చూపేలా ప్రవర్తించాలని ఆయన హితవు పలికారు.

