కలం, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా కేంద్రంలోని పద్మశాలి సమాజ బంధువులకు, నేత కార్మికుల (Weavers) కు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఒకేసారి డబుల్ ధమాకా అందించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పద్మశాలి భవన నిర్మాణ పెండింగ్ బిల్లులతో పాటు, నేతన్నలకు నిరంతరం ఉపాధి కల్పించే బృహత్తర పథకాలకు ఏకంగా రూ. 143.48 కోట్ల భారీ నిధులను విడుదల చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
రూ. 2 కోట్లతో ఊపందుకోనున్న పద్మశాలి భవన్ పనులు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పద్మశాలి భవన నిర్మాణ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ. 2 కోట్ల పెండింగ్ బిల్లుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఈ విషయాన్ని సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, సీఎం వెంటనే స్పందించి నిధులను మంజూరు చేశారు. శనివారం నాటికి ఈ మొత్తం కాంట్రాక్టర్ ఖాతాలో జమకావడంతో నిలిచిపోయిన భవన నిర్మాణ పనులు తిరిగి వేగవంతం కానున్నాయి.
ఉపాధికి భరోసా: రూ. 141.48 కోట్లు విడుదల
మరొక వైపు సిరిసిల్ల చేనేత, పవర్‌లూమ్ రంగానికి ప్రాణం పోసేలా ప్రభుత్వం భారీ ప్రణాళికను అమలులోకి తెచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల తయారీ పథకానికి రూ. 92.54 కోట్లు, వివిధ ప్రభుత్వ శాఖల అవసరాల నిమిత్తం పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌లు, బెడ్డింగ్ మెటీరియల్ తయారీ ఆర్డర్ల కోసం రూ. 48.94 కోట్లు విడుదల చేసింది. మొత్తంగా రూ. 141.48 కోట్లు ఖాతాల్లోకి చేరడంతో సిరిసిల్ల మగ్గాల సప్పుడు మళ్లీ వేగవంతం కానుంది.
నేతన్నలలో మిన్నంటిన సంబరాలు
ఏకకాలంలో సమాజ భవన నిర్మాణానికి, కార్మికుల ఉపాధికి నిధులు మంజూరు కావడం పట్ల జిల్లా వ్యాప్తంగా పద్మశాలి బంధువులు, నేత కార్మికులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల కష్టాలను గు గుర్తించి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నిధుల సాధన కోసం నిరంతరం శ్రమించిన ఆది శ్రీనివాస్ (రాష్ట్ర ప్రభుత్వ విప్), కేకే మహేందర్ రెడ్డి (సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి), నాగుల సత్యనారాయణ (జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్), సంగీతం శ్రీనివాస్ (జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు) లకు పద్మశాలి ఐక్యవేదిక, చేనేత సంఘాల నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

