కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ గచ్చిబౌలి (Gachibowli) పరిధిలో పోలీసు సిబ్బందిపై RMP వైద్యుడు (RMP Doctor) దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. నానక్‌రామ్‌గూడలోని అపోలో ఆసుపత్రి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 112కు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేపట్టగా.. RMP డాక్టర్ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు.
హెడ్ కానిస్టేబుల్‌పై దాడి
ఫిర్యాదుపై విచారణ చేసేందుకు హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో సదరు RMP డాక్టర్ పోలీసు సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హెడ్ కానిస్టేబుల్ చేతిలో ఉన్న ఫోన్‌ను నేలకేసి కొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం పోలీసు సిబ్బంది కాలర్ పట్టుకుని ముఖంపై పలుమార్లు పిడిగుద్దులు గుద్దినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిపై కేసు నమోదు
ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని సునీల్ కుమార్ (36)గా పోలీసులు గుర్తించారు. వరంగల్ పట్టణంలోని ఉషా క్లినిక్‌లో RMP డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు సిబ్బందిపై దాడికి పాల్పడిన ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, దాడికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

