కలం, వెబ్ డెస్క్ : స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మళ్లీ తీవ్ర ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah ), ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే పదవికి కడియం వెంటనే రాజీనామా చేసి, ధైర్యముంటే ఉపఎన్నికల బరిలోకి దిగాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ వికెట్ తర్వాత పడే తదుపరి వికెట్ కడియం శ్రీహరిదేనని వ్యాఖ్యానించారు.
త్వరలో పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై సుప్రీంకోర్టు తీర్పుతో కడియం శ్రీహరికి రాజకీయ సమాధి ఖాయమని రాజయ్య స్పష్టం చేశారు. ప్రజాతీర్పును ధిక్కరించి కాంగ్రెస్ గూటికి చేరిన నాయకులకు ఈ తీర్పు ద్వారా తగిన గుణపాఠం తప్పదని వ్యాఖ్యానించారు. అంతేకాదు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధితో పోలిస్తే, కడియం శ్రీహరి ఏం చేశారో నిరూపించాలని, వెంటనే నియోజకవర్గ అభివృద్ధిపై శ్వేతపత్రంవిడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా రాజయ్య, కడియం మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరాయి. ఇక పార్టీ ఫిరాయింపుల చట్టం వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న వేళ కడియం శ్రీహరికి రాజయ్య విసిరిన తాజా సవాల్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

