కలం, నల్లగొండ బ్యూరో: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మంత్రి పదవి వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) ఆశించి భంగపడ్డ సంగతి తెలిసిందే. తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని అధిష్ఠానం హామీ ఇచ్చిందని తాజాగా జరిగిన మీడియా సమావేశంలో రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
అయితే అధిష్ఠానం ఇప్పుడు ఏం చేస్తుందో తనకు తెలియదని.. తాను మంత్రి పదవి కోసం పాకులాడటం లేదని స్పష్టం చేశారు. మంత్రి పదవి వచ్చినా రాకపోయినా నిజం మాట్లాడుతానన్న రాజగోపాల్ రెడ్డి.. ఏ పదవి లేకపోయిన తనకు ప్రజల్లో తగిన గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. తనకు మంత్రి పదవి ఇస్తే అది వ్యక్తిగతంగా తనకంటే కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికే మంచి పేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనలాంటి తెలంగాణ ఉద్యమకారుల సేవలు అవసరమని తెలిపారు.కేడర్ లో పట్టున్న నేతలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పరోక్షంగా అధిష్ఠానానికి గుర్తుచేశారు. కాగా, తనకు సీఎం రేవంత్ రెడ్డితో (Revanth Reddy) ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. నిన్న అసెంబ్లీలో ఎదురుపడినప్పుడు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని పలకరించానని వెల్లడించారు. నేడు అసెంబ్లీ డైనింగ్ హాల్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో జరిగిన భేటీపై రాజగోపాల్ రెడ్డి స్పష్టతనిచ్చారు. అది కేవలం సాధారణ సంభాషణ మాత్రమేనన్న రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy).. 2018 ఎన్నికల్లో 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం తప్పని కేటీఆర్ కు చెప్పానని వివరించారు.
Read Also: మోదీకి ట్రంప్ ఫోన్.. యుద్ధంపై చర్చ
Follow Us On : WhatsApp

