కలం, నల్లగొండ: ‘రైతు డిస్కమ్’ (Raitu DISCOM) పేరిట ప్రత్యేక విద్యుత్తు పంపిణీ వ్యవస్థ తీసుకురావడం ద్వారా వ్యవసాయ రంగానికి సరికొత్త ఊతం లభిస్తుందని ప్రభుత్వ విప్‌లు వేముల వీరేశం, అద్దంకి దయాకర్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘రైతు డిస్కమ్’ ఏర్పాటుపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించిన ప్రజా అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించగా వీరు మాట్లాడారు. అన్నదాతలకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసేందుకు ఈ డిస్కమ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందన్నారు. రైతుల సంక్షేమం, ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయానికి ప్రజల నుంచి, ముఖ్యంగా వ్యవసాయ రంగం నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఈ ప్రత్యేక వ్యవస్థ ద్వారా రాబోయే రోజుల్లో రైతులకు విద్యుత్ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని, వ్యవసాయం మరింత లాభసాటిగా మారుతుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు.

