Mobile Popup Ad
Mobile Popup Ad

గురుకులాలకు భారీ స్పందన.. ఫేజ్-1లో 18,401 సీట్లు భర్తీ: మంత్రి లక్ష్మణ్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ గురుకులాల్లో సీట్ల భర్తీకి భారీ స్పందన వచ్చిందని.. ఫేజ్-1లోనే 18,401 సీట్లు భర్తీ అయ్యాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Laxman) స్పష్టం చేశారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సైనిక పాఠశాలలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE), నాన్-సీఓఈ, ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను సచివాలయంలో మంత్రి విడుదల చేశారు.

దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ విద్యను సామాజిక మార్పుకు ప్రధాన సాధనంగా భావిస్తున్నారని చెప్పారు. పేద, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను పూర్తిగా ఉచితంగా అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. గురుకుల విద్యాసంస్థలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చారిత్రాత్మక చర్యలు తీసుకుంటోందని వివరించారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 5న ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయగా, ఏప్రిల్ 6 నుంచి మే 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను (Gurukul Admissions) స్వీకరించమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 45,357 దరఖాస్తులు అందగా, అందులో MPC గ్రూప్‌కు 21,447, BiPC గ్రూప్‌కు 17,400, MEC, CEC, HEC గ్రూపులకు కలిపి 6,510 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉండగా, మే 15న 117 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 39,052 మంది విద్యార్థులు హాజరై 86.09 శాతం హాజరు నమోదైనట్లు వెల్లడించారు. ఫేజ్-1 అడ్మిషన్లలోనే మొత్తం 18,401 సీట్లు భర్తీ కావడం గురుకులాలపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఇంకా 1,339 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. గ్రూపుల వారీగా సీట్ల భర్తీ వివరాలు ఇలా ఉన్నాయి.

*MPC : 8,440 సీట్లకు 8,156 సీట్లు భర్తీ : 96.63%
*BiPC : 8,280 సీట్లకు 7,425 సీట్లు భర్తీ : 90.00%
*MEC : 520 సీట్లకు 377 సీట్లు భర్తీ : 72.00%
*CEC : 1,520 సీట్లకు 1,500 సీట్లు భర్తీ : 98.68%
*HEC : 280 సీట్లకు 257 సీట్లు భర్తీ : 98%
*వొకేషన్ కోర్సులు: 700 సీట్లకు 686 భర్తీ

అన్ని గ్రూప్‌లలో 93.21శాతం సీట్లు భర్తీ..

రాష్ట్రంలో మొత్తం అన్ని గ్రూప్ లలో 93.21శాతం సీట్లు భర్తీ అయిందని మంత్రి స్పష్టం చేశారు. ఫేజ్-1లో ఎంపికైన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో జూన్ 7లోపు సంబంధిత కళాశాలల్లో ప్రవేశాలు పూర్తి చేసుకోవాలన్నారు. జూన్ 1 నుంచి కాలేజీలు ప్రారంభమవుతున్నందున విద్యార్థులను మొదటి రోజే కళాశాలలకు పంపించాలని మంత్రి కోరారు. నేడు జాతీయ స్థాయిలో సోషల్ వెల్ఫేర్ గురుకులాలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని మంత్రి కొనియాడారు. JEE Main-2026లో 337 మంది విద్యార్థులు అర్హత సాధించగా, అందులో 26 మంది 90 శాతం పైగా పర్సంటైల్ సాధించడం గర్వకారణమన్నారు. గత ఏడాది 525 మంది విద్యార్థులు JEE అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించడం గురుకుల విద్యా వ్యవస్థ సామర్థ్యానికి నిదర్శనమని చెప్పారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలు IIT-JEE, NEET, NDA, CLAT వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో కార్పొరేట్ కాలేజీలకు పోటీగా ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. గ్రామీణ, దళిత, గిరిజన ప్రాంతాల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని జాతీయ స్థాయిలో నిలబెడుతున్నామని మంత్రి వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>