కలం, వెబ్ డెస్క్: ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ రాహుల్ నవీన్ (Rahul Navin) పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీతో ఆయన పదవీ కాలం ముగియబోతుండగా.. అనూహ్యంగా మరో ఏడాది కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, రాహుల్ నవీన్ 2027, ఆగస్ట్ 13వ తేదీ వరకు డైరెక్టర్ బాధ్యతల్లో కొనసాగనున్నారు. 2027, జులై 31 నాటికే ఆయన రిటైర్మెంట్ కావాల్సి ఉన్నా.. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈయన డైరెక్టర్ బాధ్యతల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది.
వచ్చీ రాగానే ఇద్దరు సీఎంల అరెస్ట్..
1993 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారైన రాహుల్ నవీన్ ఈడీ డైరెక్టర్‌గా వచ్చిన వెంటనే దూకుడు పెంచారు. అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసుల్లో అరెస్ట్ చేయించారు. కల్వకుంట్ల కవిత కూడా అరెస్టయి కొంతకాలం తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ డైరెక్టర్ల పదవీ కాలాన్ని తరచూ పొడిగించవద్దని గతంలో సుప్రీంకోర్ట్ స్పష్టంగా చెప్పడంతో.. త్వరలోనే కొత్త డైరెక్టర్ రాబోతున్నారంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, ఆయన్ను కొనసాగించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపడం గమనార్హం.

