కలం, జగిత్యాల: 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు ముందే అన్ని పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) తెలిపారు. గురువారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల (Kotilingala) గ్రామంలో పుష్కరాల అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
పుష్కరాల పనుల్లో భాగంగా ధర్మపురి నియోజకవర్గానికి ఇప్పటికే రూ.117 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా అదనంగా నిధులు కేటాయించాలని కోరగా రూ.81 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. కోటిలింగాల ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు, పుష్కర ఘాట్ల నిర్మాణానికి రూ.16.13 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. శంకుస్థాపన చేసిన పనులను 2027 ఫిబ్రవరి 29లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వం నిర్వహించనున్న తల్లిదండ్రులు, వయోవృద్ధులు, దివ్యాంగుల వారోత్సవాల పోస్టర్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ కలిసి ఆవిష్కరించారు.

