సింగరేణికి వాన‌ దెబ్బ.. బొగ్గు ఉత్పత్తికి విఘాతం!

కలం, ఖమ్మం బ్యూరో: అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు (Heavy Rains) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి (Singareni) సంస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. మణుగూరు (Manuguru) ఏరియా పరిధిలోని ఉపరితల (ఓపెన్ కాస్ట్) బొగ్గు గనులను వరద నీరు ముంచెత్తడంతో రోజువారీ బొగ్గు ఉత్పత్తి (Coal Production) ప్రక్రియతో పాటు ఓవర్ బర్డెన్ మట్టి తొలగింపు పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. గనుల్లో భారీగా వర్షపు నీరు, బురద పేరుకుపోవడంతో ఒక్కసారిగా ఉత్పత్తి నిలిచిపోయి సింగరేణి యాజమాన్యానికి భారీ గండి పడింది. మణుగూరు ప్రాంతంలో 16.59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం, ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురవడంతో ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఫలితంగా తవ్వకాలతో పాటు ప్రతిరోజూ చేపట్టాల్సిన 1.65 లక్షల టన్నుల ఆఫ్‌లోడింగ్, మట్టి తొలగింపు ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

సాధారణంగా మణుగూరు ఏరియాలో రోజుకు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకోగా, వర్షాల ధాటికి ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. ప్రతికూల పరిస్థితుల వల్ల రోజువారీ లక్ష్యంలో కేవలం 10,430 నుంచి 29,750 టన్నుల వరకు మాత్రమే ఉత్పత్తి సాధ్యమవగా, ఒక్కరోజే సుమారు 10,250 టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తిని కోల్పోవాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. ​గనుల్లో నిలిచిపోయిన వరద నీటిని బయటకు పంపేందుకు సింగరేణి యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రత్యేక పంపింగ్ మోటార్లు, భారీ బాహుబలి మోటార్లను రంగంలోకి దించి నిరంతరం నీటిని బయటకు తోడుతున్నారు. వీలైనంత త్వరగా గనుల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పి ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

​మరోవైపు ఈ భారీ వర్షాల ధాటికి రహదారులపైకి నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణ శాఖ ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో యంత్రాంగం ముందస్తు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు నిరంతరం పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>