కలం, వెబ్డెస్క్: ఏపీలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్కూళ్లకు కూడా సెలవు ఇచ్చేశారు. రోడ్లన్నీ జలమయమై కొన్ని చోట్ల రాకపోకలకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విజయనగరం (Vizianagaram) జిల్లాలో వర్షాలకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. దత్తిజేరు మండలంలోని పెద్దగాథ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వరుస వానలకు, చలికి తట్టుకోలేక సామిరెడ్డి పరదేశమ్మ, నింగిరెడ్డి లక్ష్మునాయుడు అనే వృద్ధులు ప్రాణాలు విడిచారు.
వర్షంలో వృద్ధుల అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్మశాన వాటికకు గ్రామంలో నుంచి సరైన దారి లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. భారీ వర్షాలతో ఊరి నుంచి స్మశానానికి వెళ్లే దారిలో ఉన్న ఏడుంపుల గెడ్డ వాగు నిండిపోయింది. స్మశానానికి వెళ్లేందుకు మరో మార్గం లేదు. గ్రామస్తులు అష్టకష్టాలు పడుతూ, నీటిలోనే జాగ్రత్తగా నడుస్తూ, వాగు దాటి మృతదేహాలను తరలించారు. గ్రామంలో ఉన్న ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా లేవని, చివరికి చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు కూడా ఇబ్బందులే ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మశాన వాటికకు సరైన రహదారి నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

