లోపం లేకున్నా.. దివ్యాంగులే: ముడుపుల మాయలో ‘సదరం’!

కలం, నల్లగొండ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఆసరా లేని నిరుపేదలకు, భరోసాగా నిలిచేందుకు సామాజిక భద్రతా పింఛన్లను మంజూరు చేస్తుంటే, క్షేత్రస్థాయిలో అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. ఎలాంటి లోపం లేని అనర్హులు దర్జాగా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. అర్హులైన దివ్యాంగులు పింఛను కోసం సదరం క్యాంపుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు కరుణ చూపడంలేదు.

కానీ.. రూ.30 వేల నుంచి రూ.50వేల ముడుపులు ఇస్తే చాలు దర్జాగా సదరం సర్టిఫికెట్ చేతిలో పెడుతున్నారు. పింఛన్ వచ్చేలా చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంగా ముఠాగా ఏర్పడి నకిలీ సదరం సర్టిఫికెట్ల దందా (Sadarem Scam)ను నడుపుతున్నారు. వైద్యులు, దళారులు కుమ్మక్కై వ్యవహారం నడుపుతుండగా ప్రతి నెల కోట్లలో ప్రజాధనం పక్కదారి పడుతోంది. ఒక్క కేతేపల్లి మండలంలోనే దాదాపు 1,000కిపైగా నకిలీ సర్టిఫికెట్లు బయటపడతాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లెక్క తీస్తే వేలల్లో ఉండే అవకాశముందంటున్నారు.

కేతేపల్లి మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో నకిలీ సదరం సర్టిఫికెట్ల బాగోతంపై కలెక్టర్ దృష్టిసారించాలని, స్పందించి నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరుతున్నారు. అనర్హులను ఏరివేసి, బాధ్యులైన వైద్యులు, దళారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా.. ప్రజాధనం రికవరీ చేసి నిజమైన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంగా సాగుతున్న సదరం నకిలీ సర్టిఫికెట్ల దందా సంచలనంగా మారింది.

ప్రజాప్రతినిధి సోదరుడే సూత్రధారి

నల్లగొండ జిల్లా కేంద్రంలో సదరం సర్టిఫికెట్లు జారీ చేసే కొందరు వైద్యులు, మధ్యవర్తులతో కుమ్మక్కై దందాను నడుపుతున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు 40 శాతం పైబడి వైకల్యం ఉంటేనే పింఛనుకు అర్హత లభిస్తుంది. కానీ, ముడుపులు ఇస్తే చాలు.. ఆరోగ్యవంతులకు సైతం 50 నుంచి 70 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారు. నకిలీ పత్రాలతో అనర్హులు దర్జాగా ప్రతి నెలా భారీగా దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నారు.

నకిరేకల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి సోదరుడు జిల్లా కేంద్రంలోని సదరం క్యాంపులో ఈ దందాకు కీలకంగా ఉన్నాడు. వైద్యారోగ్య శాఖలోని ఒకరిద్దరు అధికారులతో కుమ్మక్కై ఒక్కో సర్టిఫికెట్‌కు తక్కువలో తక్కువ రూ.30వేలు వసూలు చేస్తున్నాడు. సదరం సర్టిఫికెట్ ఇప్పిస్తున్నాడు. ఇటీవల నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.35వేలు తీసుకుని రెండు, మూడు రోజుల్లోనే సర్టిఫికెట్ జారీ చేయడం గమనార్హం.

మండల కేంద్రంగా దందా..

కేతేపల్లి మండల కేంద్రంతో పాటు చీకటిగూడెం గ్రామంలోనూ నకిలీ సర్టిఫికెట్ల దందా జోరుగా నడుస్తుందని స్థానికులకు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎలాంటి శారీరక లోపాలు లేనివారు, వ్యవసాయ పనులు, కఠిన శ్రమ చేసేవారు సైతం దివ్యాంగుల కోటాలో పింఛన్ పొందుతుండటం చూసి ఆశ్చర్యపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ‘ పింఛన్ ఇప్పిస్తాం.. మాకు సగం ఇవ్వండి’ అని దళారులు ఒప్పందాలు కుదుర్చుకుని పింఛన్ దందాను నడిపిస్తున్నారు.

స్వతంత్ర వైద్య బోర్డుతో తనిఖీలు చేస్తే..

కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. జిల్లాలో దివ్యాంగుల పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరికీ జిల్లా వెలుపల నుంచి వచ్చిన స్వతంత్ర వైద్య బోర్డు ద్వారా తిరిగి శారీరక పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులు, దళారులు, అక్రమంగా సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వ ధనాన్ని బొక్కేసే అనర్హులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటివరకు వారు పొందిన పింఛను మొత్తాన్ని రికవరీ చేయాలని స్పష్టంచేస్తున్నారు. అనర్హుల ఏరివేత ద్వారా నిధులు ఆదా చేసి, ఏళ్లుగా దరఖాస్తులు చేసుకుని పింఛను కోసం ఎదురుచూస్తున్న అసలైన దివ్యాంగులకు, నిస్సహాయులకు తక్షణమే ఆసరా అందించాలని పేర్కొంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>