కలం, వెబ్ డెస్క్: మహిళా బిల్లుతో (Women Reservation Bill) ఓబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఎన్డీయే సర్కారు దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయకుండా మనువాదం అమలు చేస్తోందని మండిపడ్డారు. శుక్రవారం లోక్‌సభలో మహిళా బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకొచ్చిందని.. అదే బిల్లును యథాతథంగా అమలు చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని రాహుల్ చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు ఈ బిల్లుతో తీవ్రనష్టం వాటిల్లబోతున్నదని చెప్పారు. బీజేపీ హిందూ పార్టీ అని చెప్పుకుంటూ దళితులు, ఓబీసీలకు అన్యాయం చేస్తోందని చెప్పారు. వారు హిందువులు కాదా? అని రాహల్ ప్రశ్నించారు. దేశం ఆత్మను దెబ్బతీస్తే సహించబోమని హెచ్చరించారు.
ఎన్నికల స్వరూపాన్ని మార్చేస్తున్నారు
దేశ ఎన్నికల మ్యాప్‌ను మార్చేసి శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్ (Rahul Gandhi) ఆరోపించారు. డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుతో ముడిపెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నష్టం చేస్తోందని పేర్కొన్నారు. జనాభా నియంత్రణలో మెరుగైన పనితీరు చూపిన రాష్ట్రాలకు నష్టం కలిగించేలా ఈ బిల్లు ఉందన్నారు. ‘ఇది మహిళల కోసం తీసుకొచ్చి బిల్లు కాదు. మహిళల సాధికారతతో ఈ బిల్లుకు సంబంధం లేదు” అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘2023లో అందరి మద్దతుతో మహిళల రిజర్వేషన్ బిల్లు ఆమోదించారు’ ఈ బిల్లును అమలు చేయండి అంటూ రాహుల్ ప్రస్తావించారు. “ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది దేశ వ్యతిరేక చర్యే. మేము ఈ బిల్లను అనుమతించము… విపక్షం దీన్ని ఖండిస్తుంది’ అంటూ పేర్కొన్నారు.
లోక్‌సభలో గందరగోళం
రాహుల్‌గాంధీ వ్యాఖ్యలతో లోక్ సభలో గందరగోళం నెలకొన్నది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిరణ్ రిజుజు తీవ్రంగా ఖండించారు. రాహుల్ సభా మర్యాదలు పాటించాలని కోరారు. రాహుల్ కేంద్రప్రభుత్వాన్ని మాత్రమే విమర్శించడం లేదని.. దేశం మొత్తాన్ని విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు.
విపక్షాల అభ్యంతరం ఏమిటి?
మహిళల రిజర్వేషన్ బిల్లు అమలును డీలిమిటేషన్ బిల్లులతో ముడిపెట్టడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం కలుగుతుందని విపక్షం గట్టిగా వాదిస్తోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే, జనాభా వృద్ధిని నియంత్రించిన దక్షిణ రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తాయని, ఉత్తర హిందీ రాష్ట్రాలు ఎక్కువ సీట్లు పొంది ఎన్నికల్లో ఎక్కువ బలం పొందుతాయన్నది విపక్షం వాదన. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా దక్షిణ రాష్ట్రాల నాయకులు ఈ ప్రతిపాదిత డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా గట్టిగా స్పందించారు. బీజేపీ దక్షిణరాష్ట్రాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం తగ్గిపోతుందని అంటున్నారు. దక్షిణాదిలో బీజేపీకి సాంప్రదాయకంగా ఎక్కువ పట్టు లేదు. అందుకే దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేవలం ఉత్తరాదిపై ఫోకస్ పెట్టి పట్టు నిలుపుకుంటే బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తుందని.. అందులో భాగంగానే ఈ బిల్లును తీసుకొచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also: అణచివేత నుంచి అధికారం వైపు!
Follow Us On: X(Twitter)

