భద్రాద్రి ప్రభుత్వ ఆసుపత్రులలో ఏం జరుగుతోంది?

కలం, ఖమ్మం బ్యూరో: గర్భం దాల్చిన నాటి నుంచి తొమ్మిది నెలలు ఆశలతో బిడ్డ కోసం ఎదురుచూసిన ఓ తల్లి.. సురక్షిత ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రి గడప తొక్కింది. కానీ అక్కడ ఆమెకు ఎదురైంది వైద్యం కాదు, నిర్లక్ష్యం. భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో(Govt Hospitals) వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు ప్రభుత్వ వైద్య వ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకవైపు వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి బాలింత మృతి చెందిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపడుతుండగానే, మరోవైపు పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి సకాలంలో వైద్యసేవలు అందక నిల్చున్న స్థితిలోనే ప్రసవించాల్సిన పరిస్థితి నెలకొనడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

బాలింత మృతి తర్వాత కూడా మారని పరిస్థితి

ఇటీవల గుండాల మండలం శంభునిగూడెంలో కుంజా వనజ అనే బాలింత వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ (DPH) డాక్టర్ రవీందర్ నాయక్ స్వయంగా సమీక్ష నిర్వహించి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు, డీసీహెచ్ఎస్‌తో సమావేశమయ్యారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించాలని, మాతా-శిశు మరణాలు ఏ మాత్రం సహించబోమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇకపై ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగుపడతాయనే ఆశలు వ్యక్తమయ్యాయి.

రామవరం ఆసుపత్రిలో అమానుష ఘటన

అయితే అధికారుల సమీక్షల వేడి చల్లారక ముందే రామవరం మాతా-శిశు ఆరోగ్య కేంద్రంలో మరో కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ములకలపల్లి మండలం కమ్మరపాడుకు చెందిన తాటి భవాని అనే నిండు గర్భిణి పురిటి నొప్పులతో ఆసుపత్రికి చేరుకుంది. నొప్పులతో తీవ్రంగా బాధపడుతూ సిబ్బంది సహాయం కోరినా, ఆమెకు వెంటనే వైద్యసేవలు అందలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కూర్చోవడానికి కూడా సరైన సదుపాయం లేకపోవడంతో తీవ్ర ప్రసవ వేదనలో నిల్చున్న స్థితిలోనే ఆమె ప్రసవించింది. ఈ సమయంలో నవజాత శిశువు కిందపడిపోయినట్లు, తల్లికి తీవ్ర రక్తస్రావం జరిగినట్లు సమాచారం. ఈ దృశ్యాన్ని చూసిన ఇతర గర్భిణులు, బాలింతలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమీక్షలు కాదు… చర్యలు కావాలంటున్న ప్రజలు

వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు భద్రాద్రి జిల్లా ప్రభుత్వ వైద్య వ్యవస్థలో సమన్వయ లోపం, బాధ్యతారాహిత్యాన్ని బయటపెడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రతిసారీ విచారణ కమిటీలు వేయడం, నివేదికలు కోరడం పరిపాటిగా మారిందని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం మారడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.రామవరం ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వైద్యులు, నర్సింగ్ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలతో పాటు అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని స్థానికులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ప్రభుత్వం ప్రకటించే మాతా-శిశు సంరక్షణ కార్యక్రమాలు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి గర్భిణికి సురక్షితమైన, గౌరవప్రదమైన వైద్యం అందినప్పుడే ప్రజలలో  ప్రభుత్వ వైద్య వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>