జగన్నాథ రథాన్ని లాగిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగరం గురువారం భక్తి భావంతో కళకళలాడింది. ‘జై జగన్నాథ’ నామస్మరణలతో నగర వీధులు మార్మోగాయి. మహాశక్తి ఆలయం నుంచి శ్రీ పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర (Jagannath Rath Yatra) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్వామివారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలిరావడంతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రథయాత్రకు ముందు ఆలయంలో వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారికి మహామంగళహారతి సమర్పించారు. అనంతరం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిని సుందరంగా అలంకరించిన రథంపై ఉంచి ఊరేగింపు చేపట్టారు. డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, కొల్లాపూర్ బ్యాండ్ సంగీతం నడుమ రథయాత్ర భక్తులను ఆకట్టుకుంది. మార్గమధ్యంలో భక్తులు స్వామివారిపై పూల వర్షం కురిపిస్తూ హారతులు సమర్పించారు.

రథాన్ని లాగిన గంగుల కమలాకర్

ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే  గంగుల కమలాకర్(Gangula Kamalakar)  పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన రథాన్ని స్వయంగా లాగారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. జగన్నాథ స్వామి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మహాశక్తి ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర లేబర్ అడ్డా, బొంకమ్మతోట, గీతాభవన్, బస్టాండ్, వెంకటేశ్వర ఆలయం మీదుగా నగరంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. రథయాత్ర ముగింపు సందర్భంగా నిర్వాహకులు భక్తులకు మహాప్రసాదం, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>