కలం, వెబ్ డెస్క్ : భారత దేశంలో ద్రవ్యోల్బణం రాబోతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హెచ్చరించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకున్న యుద్ధ పరిస్థితుల్లో రూపాయి పతనమవుతున్నా మోదీ ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక వ్యూహం లేదని విమర్శించారు. ‘రూపాయి 100 వైపు పరుగులు తీస్తోంది. ఇండస్ట్రియల్ ఇంధన ధరలు 25 శాతం వరకు పెరిగాయి.. ఇది సాధారణమని ప్రభుత్వం చెబుతోంది.. కానీ వాస్తవం అది కాదు. భారత్ లో ద్రవ్యోల్బణం రాబోతోంది’ అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలతో సరిపెడుతోందని, ఎలాంటి భవిష్యత్ ప్రణాళిక లేదని విమర్శించారు. ఈ పరిస్థితి వల్ల చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయని, నిత్యావసర వస్తువల ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేశారు. స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు బయటకు పోతున్నాయన్నారు. త్వరలోనే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధన ధరలు మరింత పెంచే అవకాశం ఉందని రాహుల్ తెలిపారు.

