కలం వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం(MGNREGA)లో చేస్తున్న మార్పులపై స్పందిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) పై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ధ్వంసం చేస్తోందని రాహుల్ పేర్కొన్నారు. ఈ మార్పులు మహాత్మా గాంధీ ఆలోచనలు, పేదల హక్కులపై దాడిగా అభివర్ణించారు. మహాత్మా గాంధీ ఆలోచనలు, పేదల హక్కులను ప్రధాని మోడీ తీవ్రంగా అసహ్యించుకుంటున్నారన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది గాంధీ గ్రామ స్వరాజ్య ఆకాంక్షకు రూపమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ పథకం లక్షలాది గ్రామీణ భారతీయులకు జీవనాధారంగా ఉందని చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో సైతం ఇది కీలక ఆర్థిక రక్షణగా నిలిచిందని తెలిపారు. గత పదేళ్లుగా మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని క్రమంగా బలహీనపరుస్తూ వచ్చిందని విమర్శించారు. ఇప్పుడు మోడీ ఈ పథకాన్ని పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయించుకున్నారని ఆరోపించారు. మోడీ ఈ పథకాన్ని కేంద్రీకృత నియంత్రణ సాధనంగా మార్చాలనుకుంటున్నారన్నారు. ఇందులో బడ్జెట్, పథకాలు, నియమాలు అన్నీ కేంద్రమే నిర్ణయిస్తుందని తెలిపారు.
రాష్ట్రాలపై 40 శాతం ఆర్థిక భారం పడుతుందన్నారు. నిధులు అయిపోయినప్పుడు లేదా పంటల సీజన్‌లో నెలల తరబడి కార్మికులకు ఉపాధి లభించదన్నారు. ఈ కొత్త బిల్లు మహాత్మా గాంధీ ఆదర్శాలకు ప్రత్యక్ష అవమానమని వ్యాఖ్యానించారు. భారీ నిరుద్యోగంతో భారత యువత భవిష్యత్తును ధ్వంసం చేసిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు పేద గ్రామీణ కుటుంబాల సురక్షిత జీవనోపాధిని లక్ష్యంగా చేసుకుందని రాహుల్(Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.
Read Also: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం
Follow Us On: X(Twitter)


