కలం, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కొంతమంది దాడికి యత్నించిన ఘటన మీద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకొనే శ్రీరామ నవమి రోజున ఆకివీడులో రామాలయానికి పూజలో పాల్గొనేందుకు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు , ఆయన అనుచరులపైనా, జనసేన నాయకులపైనా కొంతమంది వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
పండుగ రోజు, ఆలయం దగ్గర ఈ దాడి జరగడం వెనుక కుట్ర కోణం ఉన్నట్లుగా అనిపిస్తుందని.. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, దాడి వెనుక ఎవరున్నారో విచారణ జరిపి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానంటూ పవన్ (Pawan Kalyan) ఓ ట్వీట్ చేశారు.
మరోవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆకివీడు మండలం పెద్దపేట పర్యటనలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా పెద్దపేటలోని శిథిలావస్థకు చేరుకున్న రాముడి గుడిలో పూజలు నిర్వహించేందుకు ఆయన వెళ్లగా.. ఆయన్ని పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు ఆందోళను దిగాయి. శిథిలమైన రామాలయం స్థానంలో కొత్త గుడిని నిర్మిస్తామని రఘురామకృష్ణరాజు ఇటీవల ప్రకటించడమే దీనికి కారణం. అక్కడ రామాలయం వద్దని, గొంతెనమ్మ ఆలయం నిర్మించాలని స్థానికంగా ఉన్న దళిత సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దళిత సంఘాలు రఘురామకృష్ణరాజును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత జరిగింది. పోలీసుల బందోబస్తు మధ్య.. రఘురామకృష్ణరాజు రామాలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించి వెళ్లిపోయారు. అయితే రఘురామకృష్ణరాజు వెళ్లిపోయిన అనంతరం దళిత వర్గాలు, రామాయలం నిర్మాణం కోరుతున్న వారి మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు కత్తులు, మేకులు, రాళ్లు, చాకులతో దాడులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also: యుద్ధ భయం.. ముఖ్యమంత్రులకు మోదీ కీలక ఆదేశాలు
Follow Us On: X(Twitter)

