కలం, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి పంజా విసిరింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ (Mohan Naik)ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ మాదాపూర్‌లోని మోహన్ నాయక్ నివాసంతో పాటు 15 ప్రాంతాల్లో ఏసీబీ (ACB) అధికారులు సోదాలు చేపట్టారు. పలు బృందాలుగా విడిపోయిన అధికారులు ఉదయం నుంచే హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్‌లో తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో మోహన్ నాయక్ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. సోదల సంధర్భంగా పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ , నగదు, బంగారు ఆభరణాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్‌లోని మోహన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా డబ్బుల కట్టలు, బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులు లభించాయి. నివాసంలో రూ. 55 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మోహన్ నాయక్‌కు సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లో రూ. 1.44 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. రూ. 2 కోట్ల బంగారు ఆభరణాలు , రూ. 3.60 లక్షల వెండి ఆభరణాలు, రూ. 1.26 కోట్ల విలువైన గృహోపకరణాలు, రూ. 11.25 లక్షల విలువైన 9 సెల్ఫోన్లు, 4 ల్యాప్ టాప్‌లను అధికారులు సోదాల్లో భాగంగా స్వాధీనం చేసుకున్నారు.
సోదాల్లో భాగంగా భారీగా అక్రమ ఆస్తుల చిట్టా బట్టబయలైంది. నిజామాబాద్ జిల్లా, దిచ్‌పల్లి మండలం, ముల్లంగి గ్రామంలో సుమారు రూ. 82.89 లక్షల విలువైన ఐదు వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కొంపల్లిలో 3 ఫ్లాట్లు, గచ్చిబౌలీలో 4 ఫ్లాట్లు ఉన్నట్లు ఏసీబీ సోదాల్లో తేలింది. వీటి విలువ సుమారు రూ. 7.34 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. రూ. 25 లక్షల విలువైన రెండు కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్‌లో సుమారు రూ. 2.50 కోట్ల విలువైన ఒక ట్రీప్లెక్స్ విల్లా, కూకట్‌పల్లిలో సుమారు రూ. 62.14 లక్షల విలువైన ఒక కొత్తగా నిర్మించిన ఇల్లును అధికారులు సోదాల్లో భాగంగా గుర్తించారు. అంతేకాకుండా నిజామాబాద్‌లో కొత్తగా నిర్మించిన విల్లా కొనుగోలుకు మోహన్ నాయక్ రూ. కోటి చెల్లించినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ మొత్తం రూ. 17.94 కోట్లు ఉంటుందని అంచనా వేసినప్పటికి మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 100 కోట్లు పైనే ఉంటుందని తెలుస్తుంది.
అధికారం అండతో..
మోహన్ నాయక్ తన హోదాను అడ్డు పెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు తెలుస్తుంది. రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు గతంలోనే మోహన్ నాయక్ పై పలు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కాంట్రాక్టర్లకు టెండర్లు కేటాయించే ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టినట్లు సమాచారం.

