కలం, కరీంనగర్ బ్యూరో: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కరీంనగర్ (Karimnagar) జిల్లాకు కేటాయించిన 2,77,340 ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి చేసినట్లు డీఈవో ఎన్.ప్రశాంత్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని 16 మండలాలకు చేరవేసినట్లు వివరించారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామన్నారు. ఎంఈవోలు ప్రత్యేక చొరవ తీసుకొని జూన్ 12వ తేదీ నాటికి తమ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు సకాలంలో చేరేలా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పాఠ్య పుస్తకాల స్వీకరణ, నిల్వ, పంపిణీ ప్రక్రియలో ప్రధానోపాధ్యాయులు, సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎక్కడా కొరత లేదా ఆలస్యం తలెత్తకుండా చూడాలని సూచించారు. పుస్తకాల పంపిణీని విజయవంతంగా పూర్తి చేసిన టెక్స్ట్‌బుక్స్ జిల్లా మేనేజర్, నోడల్ అధికారి, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు, సిబ్బందిని జిల్లా విద్యాశాఖాధికారి అభినందించారు.

