కేసీఆర్‌ని సీఎం చేసేవరకు విశ్రమించేది లేదు: పువ్వాడ

కలం, ఖమ్మం బ్యూరో: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ (KCR)ని ముఖ్యమంత్రి చేసి తీరుతామని, అలాగే కేసీఆర్ ఉప్పు తిని తప్పుగా మాట్లాడేవారిని ఈసారి అసెంబ్లీ గేటుని కూడా తాకనివ్వమని బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) అన్నారు. శుక్రవారం దుమ్ముగూడెం మండలం లక్ష్మి నగరం నందు భద్రాచలం (Bhadrachalam) నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు లక్షన్నర ఎకరాలు, పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కల అని.. ఎంతో శ్రమించి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వాళ్ళే ప్రాజెక్ట్ కట్టినట్లుగా మోటార్లు ఆన్ చేసి నెత్తిన నీళ్లు చల్లుకున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కమీషన్లు దండుకొని ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవరిస్తున్నారని ఆరోపించారు.

ఈ దేశంలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతులు ఎన్నో కష్టాలు భరించి పంటలు పండిస్తే కొనే దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు. మనిషిని మనిషి ముట్టుకునే పరిస్థితి లేని కరోనా సమయంలో కూడా ప్రతి గింజ కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా తెరవట్లేదని మండిపడ్డారు. షాపుల్లో లేని యూరియా యాపుల్లో ఎక్కడి నుంచి వస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చలేక కేసీఆర్ మీద నిందలు వేస్తూ కాలం వెళ్ళబుచ్చుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు బందుకు రాం..రాం.. దళిత బందుకు జై బీమ్ అవుతుందని ఆనాడే కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. నాట్లకు నాట్లకి మధ్యలో వచ్చే రైతు భరోసా ఇప్పుడు ఓట్లకు ఓట్లకి మధ్యలో వేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు మళ్ళీ మంచి రోజులు రావాలంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు కార్యకర్తలు అందరు కష్టపడి అత్యధిక స్థానాలు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, సీనియర్ నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>