కలం, సోన్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న ప్రచారాన్ని ప్రజల్లోకి వెళ్లి వివరించే లక్ష్యంతో నవంబర్ 3న నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర (Nirmal Maha Padayatra) నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెడిసెమ్మ రాజు పిలుపునిచ్చారు.
శనివారం సోన్ మండల కేంద్రంతో పాటు సంగంపేట్, లోకల్ వెల్మల్, బొప్పారం గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించే పాదయాత్రకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశాల్లో మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, మాజీ ఎంపీపీ సరిగెల గంగన్న, సర్పంచులు విలాస్, గంగాధర్, నరేష్, సోన్ ఉపసర్పంచ్ దాసరి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

